లోక్ భవన్‌లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- May 30, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: గోవా, సిక్కిం రాష్ట్రాలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రెండు రాష్ట్రాలు తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలతో దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.

గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో నివసిస్తున్న గోవా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం దేశ సమైక్యతను మరింత బలోపేతం చేస్తోందన్నారు. గోవా తన సహజ సౌందర్యం, విశిష్ట సంస్కృతితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా, సిక్కిం శాంతి, ఆధ్యాత్మికత, ప్రకృతి వైభవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు.

దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ రెండు రాష్ట్రాలు జాతీయ ఐక్యతకు దోహదపడుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న గోవా, సిక్కిం రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పంపిన సందేశాలను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com