ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!

- June 02, 2026 , by Maagulf
ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!

దోహా: ఖతార్ పని వేళల్లో కార్మికులను హీట్ వేవ్స్ నుండి రక్షించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయంలో కార్మికులు బహిరంగ పని ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 15 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.  ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఔట్ సైడ్ పనులను నిషేధించింది. నిర్ణీత నిషేధ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం వేళల్లో పనులు తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపింది. కార్మికులు అధిక ఉష్ణోగ్రతలకు నేరుగా గురికాకుండా రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అని లేబర్ మినిస్ట్రీ ప్రకటించింది.

ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ పని ప్రదేశాలలో కార్యకలాపాలు సాగించే యజమానులు, కంపెనీలు, సంస్థలు.. రోజువారీ పని వేళలను స్పష్టంగా పేర్కొంటూ ఒక నిర్దిష్ట పని ప్రణాళికను రూపొందించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిబంధనల అమలుకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయని తెలిపింది.  నిబంధనలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ సందర్భంగా కొన్ని సూచనలు జారీ చేసింది. యజమానులు చల్లటి తాగునీరు, నీడ ఉన్న విశ్రాంతి ప్రదేశాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలని, తద్వారా వేసవి కాలంలో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కార్మికులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రథమ చికిత్సలను అందుబాటులో పెట్టాలని సూచించింది. అలాగే వేడి ఒత్తిడి స్థాయిని పర్యవేక్షించడానికి వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్ (WBGT) సూచికను ఉపయోగించాలని, పని ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు 32.1°C మించిన చోట పనిని తప్పనిసరిగా నిలిపివేయాలని ఆదేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com