జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్

- June 02, 2026 , by Maagulf
జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్


డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త పట్టాభిషేకోత్సవానికి గవర్నర్ అధ్యక్షత

విజయవాడ: దేశ అభివృద్ధి, జాతీయ పురోగతిలో ఆరోగ్య సంరక్షణ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటులో ఉండే, సరసమైన ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు.

విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త పట్టాభిషేకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పట్టాభిషేకోపన్యాసం చేసిన గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య సేవల విస్తరణ ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా స్థిరంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య, ఆరోగ్య శాస్త్ర విద్యారంగంలో విశిష్టమైన వారసత్వాన్ని నిర్మించుకుందని, వైద్యులు, దంతవైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, అనుబంధ ఆరోగ్య నిపుణులను తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల బలోపేతానికి విశేషంగా దోహదపడిందని కొనియాడారు.

విశ్వవిద్యాలయం విద్యార్థులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు ఆదర్శాలను కొనసాగించాలని, ప్రజాసేవ, మానవ గౌరవ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.

విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ఆధ్వర్యంలో డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ (DMDC) ఏర్పాటు చేయడాన్ని గవర్నర్ అభినందించారు. ఈ కేంద్రం ద్వారా వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల నిపుణులకు వ్యాధుల నమూనాల రూపకల్పన, ముందస్తు అంచనా విశ్లేషణలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ బాంబేలోని నేషనల్ డిసీజ్ మోడలింగ్ కన్సార్టియం భాగస్వామ్య సంస్థలుగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులు యోగా, ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలని, తగిన విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ సూచించారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబించాలని, జీవితాంతం నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రుల అరిథ్మియా అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ సేవల డైరెక్టర్ డాక్టర్ సి. నరసింహన్‌కు 29వ పట్టాభిషేకోత్సవం సందర్భంగా గౌరవ డి.ఎస్‌సి. పట్టా ప్రదానం చేశారు. అలాగే అపోలో ఆస్పత్రుల కార్డియాక్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పి.సి. రథ్‌కు 30వ పట్టాభిషేకోత్సవం సందర్భంగా గౌరవ డి.ఎస్‌సి. పట్టా అందజేశారు.

విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ వార్షిక నివేదికను సమర్పించగా, అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com