ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- June 05, 2026
ముంబయి: మూడు రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబయి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన "తెలుగు సాంస్కృతిక సంబరాలు-2026"లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు మంత్రిని ఘనంగా సత్కరించారు. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ముంబయిలోని సియాన్ లో ఉన్న శ్రీ షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర సర్వసతి ఆడిటోరియంలో స్థానిక తెలుగు సంఘాలను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ..ఎందరో మహానుభావులను కన్న తెలుగునేల వైభవాన్ని స్మరిస్తూ, పరాయి ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ మన భాష, యాస, ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న ముంబయి తెలుగు సంఘాల కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నిడదవోలుకు చెందిన చిన్నారి నదియ ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని, అలాగే మహారాష్ట్ర ప్రత్యేక గీతానికి చేసిన తెలుగు ప్రాంతానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాన్ని అభినందిస్తూ.. స్థానిక సంస్కృతితో సమన్వయం సాధించడం గర్వకారణమన్నారు. ఎక్కడున్నా మన మూలాలను మరువకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సోదరులేనని, తెలుగు వారిలో ఐకమత్యం లేదనే భావనను తొలగించి, భాషా పరంగా మనమంతా ఒక్కటేనని చాటిచెప్పారు. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మాతృభాష నేర్చుకోవడం తప్పనిసరి అని చెప్తూ, ఈ తరం పిల్లలకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పించాలన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమ బోధనను నిబంధనగా తెచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచంలో ఒక్క తెలుగు భాషలోనే పద్యనాటక ప్రక్రియ సజీవంగా ఉందన్న మంత్రి దుర్గేష్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా తెలుగు రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక "తెలుగు భవనం" ఏర్పాటుకు కృషి చేస్తానని, అందులో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముంబయిలోని తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి, ముంబయి ఆంధ్ర మహాసభ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఏపీ సాంస్కృతిక శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. చివరగా, ది ముంబయి ఆంధ్ర మహాసభ, జింఖానా అధ్యక్షులు కొండారెడ్డిని, వారి కార్యవర్గాన్ని కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సింగర్ గజల్ శ్రీనివాస్,ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా నిర్వాహకులు, స్థానిక తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







