ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- June 10, 2026 , by Maagulf
ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

యూఏఈ: ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 7, 2026 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అజ్మాన్‌లోని హ్యాబిటాట్ స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. సుమారు 250 మంది తెలంగాణ వాసులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్, తెలంగాణ ఉద్యమ నాయకుడు వి. ప్రకాష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” ఆలాపనతో కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక స్థూపానికి సభ్యులు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు కేవలం ఒక పండుగ కాదని, తెలంగాణ చారిత్రక వైభవం, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షలు ఫలించిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే సందర్భమని అన్నారు.

“మట్టిలో పుట్టిన గర్జనగా... గుండెల్లో రగిలిన జ్వాలగా... తరతరాల ఆకాంక్షగా... త్యాగాల తడిమిన చరిత్రగా తెలంగాణ ఆవిర్భవించింది” అని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం వరకు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన సుమారు 1,569 మంది అమరవీరుల సేవలను కొనియాడుతూ, వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన పునాది వేసిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు గణాంకాలతో, వాస్తవాలతో వివరించి చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత మేధావి ఆయన అని గుర్తుచేశారు. తెలంగాణ ఒక రాజకీయ నినాదం కాదని, అది ప్రజల హక్కు అని చాటిచెప్పిన మహనీయుడిగా జయశంకర్ సార్‌ను కొనియాడారు.

ఆరు దశాబ్దాల ఉద్యమ గాథను అధ్యయనం చేసి, ఉద్యమానికి సమర్థ నాయకత్వం అవసరమని గుర్తించి, మలి దశ ఉద్యమానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వంటి నాయకత్వం అవసరమని విశ్వసించి ప్రోత్సహించిన దూరదృష్టి గల వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన అకుంఠిత దీక్ష, అలుపెరుగని పోరాటం, దూరదృష్టి నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, కళలకు పునర్జీవం పోసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కళాకారులు, మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నాయకత్వం, ప్రజా సంఘాలు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాకవి గద్దర్, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ, గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, నందిని సిద్దారెడ్డి తదితరుల సేవలను కొనియాడారు.

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గల్ఫ్ ప్రాంతంలోని తెలంగాణ వలసదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ఉద్యమకారులకు గౌరవం కల్పించే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

అదేవిధంగా గల్ఫ్ వలసదారులు, ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న రూ.5 లక్షల మృతధన పరిహార పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన పేద కుటుంబాలకు కూడా వర్తింపజేసి వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్య అతిథి వి.ప్రకాష్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను, త్యాగాలను గౌరవించడం అని అన్నారు. తెలంగాణలో కంటే విదేశాల్లోని తెలంగాణ సంఘాలు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా కొత్త తరానికి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ వారసత్వం గురించి అవగాహన కలుగుతోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని పలు ఉదాహరణలతో వివరించారు. ETCA సంస్థ గురించి అనేక సందర్భాల్లో విన్నానని, 2011 నుంచి సంస్థ నిర్వహించిన సేవా కార్యక్రమాలను ఆడియో-విజువల్ ప్రదర్శన ద్వారా చూసి ఎంతో ఆనందించానని, సభ్యుల సేవా భావం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ ప్రముఖుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు చేయగా, మహిళా విభాగ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద్-విపుల దంపతుల హాస్య నాటిక, గాయకుడు మల్లేష్ కోరేపు ఆలపించిన తెలంగాణ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అలిగేటి, జాయింట్ సెక్రటరీ శేఖర్ గౌడ్, కోశాధికారి తిరుమల్ రావు, కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్, సభ్యులు సాయి చందర్, వెంకటేశ్వర్ రావు, మధుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, సంతోష్ కుమార్, రాము జల, రాము కందుకూరి, రఘు అలిగేటి, రమణ స్వర్గం, సారిక, మౌనిక తదితరులతో పాటు వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల అధ్యక్షులు రాజ శ్రీనివాస్ రావు, మస్సియోద్దీన్, గుండెల్లి నర్సింహా, రవి కటుకం, ఎస్‌వీఎస్ రెడ్డి, మా గల్ఫ్ చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు ,లెమన్ స్టూడియో రమేష్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విదేశీ గడ్డ పై తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com