రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు..

- June 11, 2026 , by Maagulf
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పీఠం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

అన్ని వర్గాలతో కలిసి నిరసనలు
ఈ నిరసన ర్యాలీలను కేవలం రాజకీయ పరంగానే కాకుండా, ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోయిన బాధితుల గళంగా మార్చాలని జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ర్యాలీలలో సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయనున్నారు. ప్రభుత్వ హామీల అమలులో జరిగిన మోసాన్ని ప్రశ్నిస్తూ రైతులు, మహిళలు పాల్గొంటారు. ఉపాధి అవకాశాల లేమి, ప్రభుత్వ నిర్ణయాలపై యువత గళమెత్తనుంది. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీ అక్రమాల వల్ల తీవ్రంగా నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలలో భాగం కానున్నారు.

ర్యాలీల ముఖ్య ఉద్దేశ్యం ఇదే!
చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను దగా చేశారని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఈ ర్యాలీల ద్వారా ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కామ్‌లు, వెన్నుపోట్లు, అలాగే ఎన్నికల హామీల ఉల్లంఘనలపై నిలదీయడమే ఈ ర్యాలీల ప్రధాన లక్ష్యం. వీటన్నింటితో పాటు ముఖ్యంగా డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయానికి గురైన వేలాది మంది నిరుద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి సంఘీభావం తెలియజేయడమే ఈ నిరసనల ముఖ్య ఉద్దేశ్యమని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com