కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

- June 18, 2026 , by Maagulf
కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

వేసవి తీవ్రత నేపథ్యంలో తల్లిదండ్రులకు యూఏఈ పోలీసుల హెచ్చరిక

షార్జా: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతున్న నేపథ్యంలో, కార్లలో చిన్నారులను ఒంటరిగా వదిలివేయొద్దని షార్జా, అజ్మాన్, ఫుజైరా పోలీసు అధికారులు తల్లిదండ్రులు మరియు వాహనదారులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

వేసవి కాలంలో వాహనాల లోపలి ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగి, కొద్ది నిమిషాల్లోనే ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేడి కారణంగా పిల్లలకు కలిగే ప్రమాదాలను నివారించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

షార్జా పోలీసు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ కే మాట్లాడుతూ, “కేవలం కొన్ని నిమిషాల కోసమేనని భావించి పిల్లలను కారులో వదిలివేయడం కూడా తీవ్ర ప్రమాదానికి కారణమవుతుంది. బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకున్నప్పుడు, పార్క్ చేసిన వాహనం లోపలి ఉష్ణోగ్రత పది నిమిషాల్లోనే 60 డిగ్రీలకుపైగా పెరిగే అవకాశం ఉంది” అని హెచ్చరించారు.

పిల్లల శరీర ఉష్ణోగ్రత పెద్దల కంటే మూడు నుంచి ఐదు రెట్లు వేగంగా పెరుగుతుందని, దీంతో తీవ్రమైన వడదెబ్బ, శ్వాసకోశ వైఫల్యం లేదా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

వాహనాలను లాక్ చేసే ముందు వెనుక సీట్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, కార్ కీలు పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచాలని షార్జా పోలీసులు సూచించారు.

సామాజిక బాధ్యతగా చూడాలి

అజ్మాన్ పోలీసు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ హమీద్ బిన్ హిందీ మాట్లాడుతూ, చిన్నారుల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు.

“ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకోవచ్చు. ఇంజిన్ ఆన్‌లో ఉన్నా, ఎయిర్ కండిషనర్ నడుస్తున్నా లేదా ఆఫ్‌లో ఉన్నా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాల్లో ఒంటరిగా వదిలివేయకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే కారులో ఒంటరిగా చిక్కుకుపోయిన పిల్లలను ఎవరైనా గమనిస్తే వెంటనే అత్యవసర నంబర్ 999కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

చట్టపరమైన చర్యలు తప్పవు

యూఏఈలో అమలులో ఉన్న చైల్డ్ రైట్స్ (వదీమా) చట్టం-2016 ప్రకారం పిల్లలను ప్రమాదకర పరిస్థితుల్లో వదిలివేయడం లేదా నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై భారీ జరిమానాలు, జైలు శిక్షతో సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

వేసవి తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఉత్తర ఎమిరేట్స్ పోలీసు శాఖలు స్పష్టం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com