పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల
- June 20, 2026
న్యూ ఢిల్లీ: రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-Kisan) పథకం తదుపరి అడుగు పడింది. శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ పథకానికి సంబంధించిన 23వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బటన్ నొక్కి నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ (DBT) చేశారు.
దేశవ్యాప్తంగా లబ్ధి పొందిన కోట్లాది మంది రైతులు
ఈ తాజా విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.44 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 18,880 కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం అందింది. సాగు పెట్టుబడులతో పాటు ఇతర అత్యవసర అవసరాలకు ఈ నగదు సకాలంలో ఉపయోగపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
PM Kisan: రాష్ట్రాల వారీగా పంపిణీ వివరాలు
ఈ 23వ విడత నిధులలో కొన్ని రాష్ట్రాలకు అందిన సాయం వివరాలు ఇలా ఉన్నాయి:
పశ్చిమ బెంగాల్: రాష్ట్రంలోని 45.35 లక్షల మంది రైతులకు రూ. 907 కోట్లు అందాయి.
గుజరాత్: ఇక్కడి 51.28 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 1,025 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
మహిళా రైతులు: దేశవ్యాప్తంగా లబ్ధి పొందిన వారిలో 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు ఉండటం విశేషం.
పథకం ప్రస్థానం.. ఇప్పటివరకు రూ.4.46 లక్షల కోట్లు
చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఏటా మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. తాజా విడతతో కలుపుకుని, పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలోని రైతులకు రూ. 4.46 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మీ పేరు చెక్ చేసుకోండి ఇలా..
లబ్ధిదారులు తమకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి లేదా అర్హుల జాబితాలో పేరును తనిఖీ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ http://pmkisan.gov.inలోని ‘ఫార్మర్స్ కార్నర్’ (Farmers Corner) సెక్షన్‌ను సందర్శించవచ్చు. అలాగే, ఈ పథకం కింద ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయోజనాలు పొందాలంటే రైతులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అక్రమ శాటిలైట్ ఛానళ్ల ప్రసార ముఠాను ఛేదించిన దుబాయ్ పోలీసులు
- పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన







