భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- June 20, 2026
హైదరాబాద్: భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువనీ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.లోక్ భవన్‌లో శనివారం సాయంత్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, తన సతీమణి జానకి శుక్లా తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక రాష్ట్ర భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని, భారతదేశ మేధో సంపత్తి, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచే సందర్భమని పేర్కొన్నారు.
భారతదేశానికి ఆధునిక ఆలోచనా విధానాలతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించిన పుణ్యభూమి పశ్చిమ బెంగాల్ అని గవర్నర్ అన్నారు. రాజా రామమోహన్ రాయ్, స్వామి వివేకానంద, మహర్షి అరవిందో వంటి మహనీయులు భారత సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేశారని గుర్తు చేశారు.
స్వాతంత్ర్య సమర చరిత్రలో బెంగాల్ విప్లవకారుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ, ‘వందేమాతరం’ గీత రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్, రాస్ బిహారీ బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయులు దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో దేశవ్యాప్తంగా లోక్ భవన్‌ల ద్వారా వివిధ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ భావనను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భౌగోళిక దూరాలు ప్రజల హృదయాలను దూరం చేయకూడదన్నదే ప్రధానమంత్రి సంకల్పమని పేర్కొన్నారు.
తెలంగాణ భూమిపై పశ్చిమ బెంగాల్ వైభవాన్ని స్మరించుకోవడం ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సౌరాష్ట్ర నుంచి సిల్చార్ వరకు భారత ఆత్మ ఒక్కటేననే సందేశం బలపడుతుందని గవర్నర్ అన్నారు. వైవిధ్యం భారతదేశ బలహీనత కాదని, అదే దేశం యొక్క గొప్ప సామూహిక శక్తి అని వ్యాఖ్యానించారు.
బెంగాల్, తెలంగాణల మధ్య అనుబంధం చారిత్రకమైందని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన ఆచార్య అఘోరనాథ్ ఛటోపాధ్యాయ సేవలను, ఆయన కుమార్తె ‘భారత కోకిల’ సరోజినీ నాయుడు దేశంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో పోషించిన పాత్రను గవర్నర్ గుర్తు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో బెంగాలీ ప్రవాస సమాజం విశేష కృషి చేస్తోందని, ఐటీ, వైద్యం, విద్య, కళలు, పరిశోధన రంగాల్లో వారి సేవలు ప్రశంసనీయమని గవర్నర్ అన్నారు. తెలంగాణను కర్మభూమిగా ఎంచుకుని రాష్ట్ర ప్రగతికి తోడ్పడటమే కాకుండా, తమ సుసంపన్నమైన భాషా, సాంస్కృతిక సంప్రదాయాలను ఇక్కడి సమాజంతో మమేకం చేశారని కొనియాడారు.
‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో భాగంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జ్ఞానం, కళలు, పరిశ్రమల రంగాల్లో మరింత బలమైన అనుబంధాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణలో నివసిస్తున్న బెంగాలీ సమాజానికి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మాట్లాడుతూ...మ్యాథ్స్, సైన్స్, సాహిత్య రంగాలలో పశ్చిమ బెంగాల్ తనదైన ముద్ర వేసుకుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో
పశ్చిమ బెంగాల్ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. హైదరాబాద్ లో నివాస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజల్లో పశ్చిమ బెంగాల్ మూలాలు ప్రజలే ఎక్కువ అన్నారు. దేశ నిర్మాణంలో ,
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బెంగాలీల పాత్ర ఎనలేనిదన్నారు.
అనంతరం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి సందేశాన్ని డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, జస్టిస్ మౌషామి భట్టాచార్య, డీసీపీ ఆర్.పి.ఎఫ్ దిబోష్మిత చటోపాధ్యాయ, కల్చరల్ లాంగ్వేజ్ ఇండియా కనెక్షన్ ప్రతినిధి అభిజిత్ భట్టాచార్య,సంయుక్త కార్యదర్శి శశికిరణా చారి, బెంగాలీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్‌లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







