యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- June 20, 2026
హైదరాబాద్: యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం-మనసు-ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిళ్లు, వేగవంతమైన జీవనశైలితో కూడిన ప్రస్తుత కాలంలో యోగా ప్రతి ఒక్కరికీ అంతర్గత ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగా భారతీయ సనాతన జ్ఞాన సంపదకు ప్రతీకగా నిలిచి, నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చైతన్యానికి మార్గదర్శకంగా మారిందన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని గవర్నర్ కొనియాడారు. 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 177 దేశాల మద్దతుతో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం భారతదేశానికి గర్వకారణమని చెప్పారు.
భారతీయుల ప్రాచీన వారసత్వమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్యం, మానసిక సమతుల్యత సందేశాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రతి పౌరుడు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన, సమృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ అన్నారు. “యోగతో ఆరోగ్యం, యోగతో సమతుల్యత, యోగతో ఆత్మబలం” అనే సందేశాన్ని ప్రజలు ఆచరణలో పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్,విజయేంద్ర ప్రసాద్, ఎంపీ శ్రీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య,అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ,సినీ నటి పాయల్ రాధాకృష్ణ,సినీ హీరో నవీన్ పొలిశెట్టి, నటి డింపుల్ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, యోగ గురువులు, యోగ సాధకులు ప్రజా ప్రతినిధులు ,యువతీ యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







