ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- June 24, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష సైనిక అధికారాలకు కళ్లెం వేస్తూ అమెరికా సెనెట్ ఒక సంచలన ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా దళాలను పంపడాన్ని ఈ తీర్మానం నిరోధిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న యూఎస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రస్థాయి యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనల మధ్య ఈ కీలక అడుగు పడింది.
ఉత్కంఠ భరితంగా ఓటింగ్.. సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ
సెనెట్‌లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, ఈ తీర్మానం నెగ్గడం గమనార్హం. ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. నలుగురు సీనియర్ రిపబ్లికన్ సెనేటర్లు—రాండ్ పాల్ (కెంటుకీ), సుసాన్ కాలిన్స్ (మైన్), లిసా ముర్కోవ్స్కీ (అలాస్కా), బిల్ కాసిడీ (లూసియానా) పార్టీ లైన్‌ను దాటి డెమొక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ తన సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌కు మద్దతుగా ఓటేశారు. గతంలో ఇలాంటి తీర్మానాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్ పక్ష నేత మిచ్ మెక్కానెల్, డేవ్ మెక్కార్మిక్లు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం డెమొక్రాట్లకు భారీగా కలిసివచ్చింది. ఇక అంతకుముందే అమెరికా దిగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ (ప్రతినిధుల సభ) లో కూడా ఈ తీర్మానం 215–208 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడ కూడా నలుగురు రిపబ్లికన్లు డెమొక్రాట్లతో చేతులు కలిపారు.
ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. వైట్ హౌస్ భిన్న వాదన
సొంత పార్టీ సభ్యులే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా స్పందిస్తూ, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చిన ప్రజాప్రతినిధులను తీవ్ర పదజాలంతో దూషించారు. వారి చర్యలు దేశభక్తి లేనివని, కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఈ ఉమ్మడి తీర్మానం సాంకేతికంగా అధ్యక్షుడి వద్దకు వెళ్లదని, కాబట్టి దీనికి చట్టబద్ధత ఉండదని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు కొట్టిపారేశారు. ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని, ప్రస్తుతం అక్కడ సైన్యం ప్రత్యక్ష యుద్ధంలో లేనప్పుడు బలగాల ఉపసంహరణ అనడం అర్థరహితమని ఆయన వాదించారు. వైట్ హౌస్ వాదనను డెమొక్రాట్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్‌ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!







