పాస్‌పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?

- June 26, 2026 , by Maagulf
పాస్‌పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?

యూఏఈ: భారత పాస్‌పోర్ట్ కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరసత్వాన్ని ధృవీకరించేది కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి స్పష్టం చేయడంతో.. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

భారత పాస్‌పోర్ట్ పొందడం అనేది కఠినమైన ప్రక్రియ. ఇది ఒకరి గుర్తింపు, విద్య, కుటుంబ నేపథ్యం, నివాసం వంటి అనేక విషయాలను ధృవీకరిస్తుంది. దీనివల్ల చాలామంది ఇది పౌరసత్వ రుజువుగా సరిపోతుందని ఇన్ని రోజులు గట్టిగా నమ్ముతూ వస్తున్నారు.

అయితే, భారత పాస్‌పోర్ట్ అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రం. ఇది 1967 పాస్‌పోర్ట్స్ చట్టం పరిధిలోకి వస్తుంది. మరోవైపు, పౌరసత్వ విషయం 1955 పౌరసత్వ చట్టం పరిధిలోకి వస్తుంది.  ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార పరిధిలోకి వస్తుంది.

అలాగే, కొన్ని సందర్భాల్లో, ప్రభుత్వం అవసరమని భావిస్తే, అధికార యంత్రాంగం పౌరులు కాని వారికి పాస్‌పోర్ట్‌లు మరియు ప్రయాణ పత్రాలను జారీ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు, ఏ పత్రాలు భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగలవు? అన్న అందరి మదిని తొలుస్తుంది. కాగా, భారత నివాసితులకు భారత ప్రభుత్వం జారీ చేసిన అనేక గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని గురించి నిపుణులు వివరించారు.

1. ఆధార్ కార్డు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (Unique Identification Authority of India) జారీ చేసే ఆధార్, 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. ఈ కార్డును భారతదేశంలోని ఏ నివాసికైనా జారీ చేయవచ్చు. దీనిని ప్రభుత్వ సేవలను పొందడానికి, అలాగే గుర్తింపు రుజువుగా ఉపయోగించవచ్చు.

అయితే, ఇది కూడా పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించదు. ఈ పత్రం గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. పౌరసత్వాన్ని కాదు. ఎందుకంటే దీనిని భారతదేశంలో నివసించే పౌరులు కాని వారికి కూడా జారీ చేయవచ్చు.

2. పాన్ కార్డు

శాశ్వత ఖాతా సంఖ్య (PAN) అనేది భారతదేశ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. ఈ సంఖ్య ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిన వ్యక్తులకు జారీ చేయబడుతుంది. అందువల్ల దీనిని పౌరసత్వ రుజువుగా పరిగణించలేము.

3. ఓటరు గుర్తింపు కార్డు

భారత ఎన్నికల సంఘం ద్వారా భారతదేశంలోని ఒక ప్రాంత పౌరులకు ఓటరు కార్డు జారీ చేయబడుతుంది. ఇది ప్రాంతీయ మరియు జాతీయ ఎన్నికలలో వారి ఓటు వేయడానికి అనుమతిస్తుంది. అయితే, ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కాకుండా ఒక ప్రత్యేక సంస్థ ద్వారా జారీ చేయబడుతుంది. అందువల్ల ఇది పౌరసత్వానికి చట్టపరమైన రుజువుగా పరిగణించబడదు.

4. జనన ధృవీకరణ పత్రం

ఒక నివాసి జనన ధృవీకరణ పత్రం దేశంలో జన్మించినట్లు రుజువును చూపుతుంది. అయితే, ఈ పత్రం ఆ వ్యక్తి నివాసి కావచ్చునని నిర్ధారించినప్పటికీ, ఇది ఆటోమెటిక్ గా పౌరసత్వాన్ని ప్రసాదించదు.  తల్లిదండ్రుల పౌరసత్వాన్ని నిరూపించగల కొన్ని సందర్భాలలో తప్ప.

పౌరసత్వం ఎలా లభిస్తుంది?

భారత పౌరసత్వం 1955 నాటి పౌరసత్వ చట్టం ద్వారా నియంత్రించబడుతుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.

ప్రస్తుతం, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ప్రకారం..  ఒక వ్యక్తి ఈ క్రింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.

పుట్టుకతో పౌరసత్వం: జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత కానీ, పౌరసత్వ (సవరణ) చట్టం, 2003 ప్రారంభానికి ముందు భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి, వారి తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులై ఉన్నా లేదా తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరుడై, మరొకరు పుట్టినప్పుడు అక్రమ వలసదారుడు కానట్లయితే, పుట్టుకతో భారత పౌరుడు అవుతారు.

వంశపారంపర్య పౌరసత్వం: భారతదేశం వెలుపల జన్మించిన ప్రతి వ్యక్తి, వారి తల్లిదండ్రులిద్దరూ లేదా వారిలో ఒకరు భారత పౌరులై, అక్రమ వలసదారుడు కానట్లయితే, వంశపారంపర్యంగా భారత పౌరుడు అవుతారు. అయితే, పుట్టిన ఒక సంవత్సరంలోపు వారి జననం విదేశాల్లోని భారత మిషన్/పోస్ట్‌లో నమోదు చేయబడి ఉండాలి.

నమోదు ద్వారా పౌరసత్వం: ఆమోదించబడిన వర్గం కిందకు వచ్చే ఏ వ్యక్తినైనా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత పౌరుడిగా నమోదు చేయవచ్చు.

నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం: పౌరసత్వ చట్టంలోని మూడవ షెడ్యూల్ నిబంధనల ప్రకారం, పూర్తి వయస్సు మరియు సామర్థ్యం ఉన్న వ్యక్తి నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నివాసితులు మరియు ఎన్నారైలు భారతదేశంలో తమ పౌరసత్వాన్ని నిరూపించుకోగలరా?

డిసెంబర్ 20, 2019న, భారతదేశ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, NRC అని కూడా పిలువబడే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ డాక్యుమెంట్ లో భాగంగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది.

"పుట్టిన తేదీ మరియు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన ఏవైనా పత్రాలను సమర్పించడం ద్వారా" పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చని అది పేర్కొంది. అయితే, అటువంటి ఆమోదయోగ్యమైన పత్రాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.

ప్రస్తుతానికి, భారత పౌరసత్వాన్ని నిరూపించగల ఆమోదయోగ్యమైన పత్రాల తుది జాబితా ఏదీ లేదని ఈ సందర్భంగా కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com