సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- July 03, 2026
విజయవాడ: రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు అండగా నిలిచేందుకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. థియేటర్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే ఉద్దేశంతో సోలార్ పవర్ వ్యవస్థల ఏర్పాటుకు సహకారం అందించనున్నట్లు ఛాంబర్ ప్రకటించింది. అదే సమయంలో పరిశ్రమతో పాటు ప్రభుత్వ సహకారం కూడా థియేటర్లకు అందేలా కృషి చేస్తామని వెల్లడించింది.
నగరంలోని హోటల్ ప్రైడ్ మాధవలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్‌ను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంథా, ప్రధాన కార్యదర్శి చైతన్య జంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు 1,400కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవని, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 716, తెలంగాణలో 302 మాత్రమే మిగిలాయని తెలిపారు.మారుతున్న పరిస్థితులు, నిర్వహణ వ్యయం పెరగడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొనసాగితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో థియేటర్ల యాజమాన్యాలకు అవసరమైన మద్దతు అందించే దిశగా ఏపీ ఫిలిం ఛాంబర్ పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సానుకూలంగా ఉందని, రాష్ట్రంలో సినిమా చిత్రీకరణలు పెరిగేలా మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు ఊతమిస్తాయని అన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ పునర్వైభవం సాధించేలా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ మార్గదర్శనంలో తాము ముందుకు సాగుతున్నట్లు మంథా శ్రీనివాస్, చైతన్య జంగా వెల్లడించారు.
నవరంగ్ థియేటర్ అధినేత వి.భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ కోసం ఏపీ ఫిలిం ఛాంబర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
నూతన ఉపాధ్యక్షుడు డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సినీ రంగంపై ఉన్న అభిరుచితో ఈ బాధ్యతలు స్వీకరించానని, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు.
సఖి శక్తి వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జయా పటేరియా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ఫిలిం ఛాంబర్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. మంచి కథాంశాలతో నిర్మించే చిత్రాలకు తమ వంతు సహకారం అందిస్తామని, సినీ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం, అవకాశాలు పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ అనయ కాశ్యప్, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎల్. రాధా రాజేశ్వరి, ట్రెజరర్ ఎం.ఈశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు పి. సోలమన్, పి. శిరీష, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోడె చైతన్య, వీఎఫ్ఎక్స్ నవీన్, డైరెక్టర్ చంద్రశేఖర్, రామిశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







