తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..

- July 04, 2026 , by Maagulf
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారమిచ్చింది. రానున్న జులై 14, జులై 17 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఉన్నందున, ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణ భక్తులకు కల్పించే దర్శన సమయాన్ని పెంచేందుకు వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ దర్శనాల రద్దుకు గల కారణాలను తితిదే తన ప్రకటనలో స్పష్టం చేసింది. జులై 14వ తేదీన ఆలయ శుద్ధీకరణ కార్యక్రమమైన ‘కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం’, అలాగే జులై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే ‘ఆణివార ఆస్థానం’ కొలువును పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలకు స్వస్తి పలికారు. ఇందులో భాగంగానే జులై 13, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని బోర్డు తేల్చిచెప్పింది.

కేవలం బ్రేక్ దర్శనాలే కాకుండా, జులై 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను కూడా తితిదే రద్దు చేసింది. ఆ రోజున స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు జరగవని వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com