దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..

- July 04, 2026 , by Maagulf
దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..

దుబాయ్: దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ విస్తరణ పనుల నేపథ్యంలో బస్సు, టాక్సీ సేవలకు ఉపయోగించే రోడ్డును 2026 చివరి వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది.

స్టేషన్ విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ వెల్లడించింది. డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫాకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజూ ఈ మెట్రో స్టేషన్‌ను వినియోగిస్తుండటంతో, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రయాణికులు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దిశా సూచిక బోర్డులను అనుసరించాలని, నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని అధికారులు సూచించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నందున, గమ్యస్థానాలకు ముందుగానే బయలుదేరాలని కూడా ఆర్టీఏ విజ్ఞప్తి చేసింది.

వాహనదారులు ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలను వినియోగించాలని, మూసివేసిన రహదారిని నిర్మాణ పనులకు సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.

దుబాయ్ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ విస్తరణ పూర్తయిన తర్వాత ప్రయాణికుల సామర్థ్యం 65 శాతం పెరగనుంది. ప్రస్తుతం గంటకు 7,250 మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఈ స్టేషన్, విస్తరణ అనంతరం 12,320 మందిని నిర్వహించగలదు. అలాగే రోజుకు గరిష్టంగా 2.20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలుగుతుందని ఆర్టీఏ వెల్లడించింది.

నూతన సంవత్సరం వేడుకలు, ప్రధాన పండుగలు వంటి రద్దీ సమయాల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఈ విస్తరణ కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com