కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- July 05, 2026
హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలులో డ్రగ్ కంట్రోల్ మరియు ఫుడ్ సేఫ్టీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న ఈ రెండు శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా వారంలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం పెరిగి, విధుల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా సీఎస్ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది పరిస్థితి తదితర అంశాలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు,ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , సీఎంవో ప్రధాన కార్యదర్శులు శేషాద్రి, ఎన్.శ్రీధర్, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ జనరల్ అవినాష్ మొహంతి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







