19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- July 06, 2026
యూఏఈ: యూఏఈలో నిర్వహించిన రాస్ అల్ ఖైమా ఫిట్నెస్ ఛాలెంజ్-2026 రెండో ఎడిషన్‌లో అహ్మద్ మహ్మద్ అల్ తనీజీ విజేతగా నిలిచారు. ఆరు నెలల పాటు సాగిన ఈ ఫిట్నెస్ పోటీలో దాదాపు 19 కిలోల బరువు తగ్గి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ఆతడు 50 వేల దిర్హామ్‌లు (సుమారు రూ.11.6 లక్షలు) నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఛాలెంజ్ ప్రారంభానికి ముందు అహ్మద్ బరువు 109 కిలోలు ఉండగా, ఛాలెంజ్ ముగిసే సమయానికి 90.5 కిలోలకు చేరుకున్నాడు. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సమతుల్య ఆహారం, నిరంతర సాధనే తన విజయానికి కారణమని అతడు తెలిపారు.
ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం ద్వారా తనను తాను మరింతగా సవాలు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకొచ్చానని అహ్మద్ చెప్పాడు. ఇప్పటికే వ్యాయామం చేస్తున్నప్పటికీ, ఈ ఛాలెంజ్ తనలో మరింత ప్రేరణ నింపిందని పేర్కొన్నారు. రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ సహా నిర్వాహకులు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాలెంజ్ సందర్భంగా పాల్గొనేవారికి ఫంక్షనల్ వర్కౌట్స్, బీచ్ ట్రైనింగ్, గ్రూప్ ఫిట్నెస్ సెషన్లు వంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి కూడా దోహదపడ్డాయని నిర్వాహకులు తెలిపారు.
కేవలం బరువు తగ్గడమే కాదు.. ఫిట్‌నెస్‌కూ మార్కులు ఈ ఛాలెంజ్ లో విజేతలను కేవలం బరువు తగ్గిన ఆధారంగా ఎంపిక చేయలేదని నిర్వాహకులు వెల్లడించారు. బాడీ మాస్ మరియు ఫిట్నెస్ అనే రెండు విభాగాలకు చెరో 50 మార్కులు కేటాయించి మొత్తం 100 మార్కుల ఆధారంగా ఫలితాలను నిర్ణయించినట్లు తెలిపారు. బరువు ఎంత తగ్గారనే అంశంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.
రెండో స్థానంలో 30 కిలోలు తగ్గిన అబ్దుల్లా ఈ పోటీలో అబ్దుల్లా మహ్మద్ అలీ అల్ షెహ్హీ రెండో స్థానంలో నిలిచి 49 వేల దిర్హామ్‌లు నగదు బహుమతి అందుకున్నాడు. ఆయన ఈ ఛాలెంజ్‌లో 30 కిలోలకు పైగా బరువు తగ్గాడు. తన విజయంలో కోచ్ అబ్దుల్ అజీజ్ మతర్ మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.
మూడో స్థానంలో హమ్దాన్ అల్ షెమైలీ ఈ ఏడాది ఫిట్నెస్ ఛాలెంజ్‌లో హమ్దాన్ అల్ షెమైలీ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయనకు 48 వేల దిర్హామ్‌లు నగదు బహుమతిగా లభించింది. కాగా, తొలి ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి పోటీకి స్పందన మరింత పెరిగిందని నిర్వాహక కమిటీ చైర్మన్ ఫైసల్ అల్ ఘైస్ అల్ జాబీ అన్నారు. అదే సమయంలో పాల్గొనేవారి సంఖ్య 110 నుంచి 121కు పెరగగా, మొత్తం బరువు తగ్గుదల 600 కిలోల నుంచి 724 కిలోలకు చేరిందన్నారు. అలాగే ఈసారి 13 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రత్యేక విభాగం కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. విజేతలకు ప్రోత్సాహకంగా మొదటి స్థానం నుంచి 20వ స్థానం వరకు నగదు బహుమతులు అందించారు. మొదటి స్థానానికి 50 వేల దిర్హామ్‌లు, రెండో స్థానానికి 49 వేల దిర్హామ్‌లు, మూడో స్థానానికి 48 వేల దిర్హామ్‌లు ఇవ్వగా, 20వ స్థానం వరకు క్రమంగా బహుమతి మొత్తాన్ని తగ్గిస్తూ 31 వేల దిర్హామ్‌ల వరకు అందజేశారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







