2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!

- July 07, 2026 , by Maagulf
2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!

అబుదాబి: అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న ప్రపంచస్థాయి వినోద కేంద్రం 'స్ఫియర్ అబుదాబి' (Sphere Abu Dhabi) 2029 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  యాస్ ఐలాండ్‌లో 1.7 బిలియన్ డాలర్ల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. అమెరికా వెలుపల తొలి స్ఫియర్‌గా, ప్రపంచంలోనే రెండో స్ఫియర్‌గా ఇది గుర్తింపు పొందనుంది.   

యాస్ మాల్, సీవర్ల్డ్ అబుదాబి మధ్య నిర్మించనున్న ఈ 'ఎక్సోస్ఫియర్' (Exosphere) భారీ ఎల్‌ఈడీ తెర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. షేక్ జాయెద్ రోడ్‌తో పాటు అబుదాబిలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇది స్పష్టంగా కనిపించేలా రూపకల్పన చేస్తున్నారు. అమెరికాలోని లాస్ వేగాస్ స్ఫియర్‌లో ఉన్న 54 వేల చదరపు మీటర్ల ప్రోగ్రామబుల్ ఎల్‌ఈడీ ఎక్స్‌టీరియర్ తరహాలోనే దీన్ని నిర్మించనున్నారు. ఈ ఎల్‌ఈడీ వెలుపలి భాగం  భారీ డిజిటల్ కాన్వాస్‌గా పనిచేయనుంది. ఇందులో యూఏఈ కళాకారుల సృజనలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ఆర్ట్ పోటీలు నిర్వహించి వారి కళాఖండాలను కూడా ప్రదర్శించే యోచనలో ఉన్నట్లు అబుదాబి సంస్కృతి, పర్యాటక శాఖ (DCT) తెలిపింది.

స్ఫియర్ లోపల అత్యాధునిక 360 డిగ్రీల డిస్‌ప్లే, స్పేషియల్ ఆడియో టెక్నాలజీతో ప్రేక్షకులకు సినిమాహాల్, థియేటర్ లేదా థీమ్ పార్క్‌లలో లభించని సరికొత్త అనుభూతిని అందించనున్నారు. యూఏఈ చరిత్ర, చమురు ఆవిష్కరణ, ఏడు ఎమిరేట్ల ఏర్పాటుతో పాటు అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ప్రగతిని ప్రేక్షకులు ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రత్యేక ప్రదర్శనలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. 

అలాగే, అంతర్జాతీయ మ్యూజిక్ కాన్సర్టులు, ఇమ్మర్సివ్ షోలు, ప్రపంచస్థాయి ఆర్ట్ ప్రదర్శనలు, యూఎఫ్‌సీ పోటీలు, బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు, ఆటోమొబైల్ ఉత్పత్తుల ఆవిష్కరణలు, ఫ్యాషన్ షోలు, ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశాలకు కూడా ఈ వేదికను వినియోగించనున్నట్లు వివరించారు. స్ఫియర్ అబుదాబిని కేవలం అంతర్జాతీయ వినోద కేంద్రంగా కాకుండా ఎమిరాటీ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డీసీటీ వెల్లడించింది. టికెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు. కార్యక్రమం, సీటింగ్ విభాగాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com