పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..

- July 08, 2026 , by Maagulf
పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..

 న్యూ ఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించేందుకు సరికొత్త కేంద్రీకృత పోర్టల్‌ను ప్రారంభించింది. జూన్ 26 నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన ఆన్‌లైన్ సేవలను, బుధవారం నాటికి సభ్యుల రికార్డులన్నింటినీ వికేంద్రీకృత వ్యవస్థ నుండి ఒకే కేంద్రీకృత డేటాబేస్‌కు విజయవంతంగా బదిలీ చేసి పునరుద్ధరించారు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ద్వారా పీఎఫ్ సభ్యులకు, యజమానులకు డిజిటల్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ ద్వారా సభ్యులు సమర్పించే క్లెయిమ్‌లు సంబంధిత కార్యాలయాలకు చేరకముందే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ముందస్తుగా ధృవీకరిస్తుంది. దీనివల్ల దరఖాస్తులో ఏవైనా తప్పులు, వ్యత్యాసాలు లేదా సమాచారం తక్కువగా ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి సభ్యులకు తెలియజేస్తారు. ఫలితంగా క్లెయిమ్ తిరస్కరణలు తగ్గి, మొదటిసారే సులభంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.

EPFO New Portal: కొత్త పోర్టల్‌తో పీఎఫ్ సభ్యులకు కలిగే ప్రయోజనాలు ఇవే:

  • దరఖాస్తుకు ముందే అర్హత తనిఖీ: సభ్యులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే ముందు, వివిధ కేటగిరీల కింద తాము ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులో ముందే చూసుకోవచ్చు.
  • ఏకీకృత సభ్యుల డాష్‌బోర్డ్: ఒకే డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్ సర్వీస్ రికార్డులు మరియు పొందిన ప్రయోజనాల వివరాలను ఒకే చోట వీక్షించవచ్చు.
  • రూ. 5 లక్షల వరకు ఆటో-సెటిల్‌మెంట్: పూర్తిగా కేవైసీ (KYC) అనుసంధానమైన ఖాతాలకు సంబంధించి, అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితిని రూ. 1 లక్ష నుండి ఏకంగా రూ. 5 లక్షల వరకు పెంచారు. ఈ పరిమితి లోపు ఉండే క్లెయిమ్‌లు చాలావరకు ఆటో-సెటిల్‌మెంట్ ద్వారా వేగంగా పూర్తవుతాయి.
  • ఆటోమేటిక్ పీఎఫ్ బదిలీ: ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు, ఆధార్-అనుసంధానిత యూఏఎన్ (UAN) ఆధారంగా పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి అభ్యర్థన సమర్పించాల్సిన అవసరం లేదు.
  • ఆన్‌లైన్ స్పందనలు: అదనపు సమాచారం కావాల్సినప్పుడు సభ్యులు ఆన్‌లైన్ ద్వారానే స్పందించవచ్చు. పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.
  • దేశంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్: కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఏ ప్రాంతీయ కార్యాలయం నుంచైనా సేవలను వేగంగా ప్రాసెస్ చేసే వీలుంటుంది.

జూలై 15 లోగా పీఎఫ్ వడ్డీ జమ!

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8.25% వడ్డీ రేటు ప్రకారం, దాదాపు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాలకు గాను సుమారు రూ. 1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ సొమ్ము జమ కానుంది. ఈ వడ్డీ జమ ప్రక్రియ కూడా ఈ కొత్త సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ధృవీకరించబడుతుంది. జూలై 15 నాటికి సభ్యులందరూ తమ పాస్‌బుక్‌లలో వడ్డీ క్రెడిట్ అయినట్లు చూసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సెటిల్‌మెంట్ మొత్తాలు కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ ద్వారా ఆమోదించబడిన రోజే నేరుగా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో పడతాయి.

పెన్షనర్లకు మరింత సౌలభ్యం
ఈపీఎస్ (EPS) పెన్షనర్లు తమ సేవలు లేదా లైఫ్ సర్టిఫికేట్లను (జీవన్ ప్రమాణ్) సమర్పించడానికి దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయాన్నైనా సంప్రదించవచ్చు. అలాగే పెన్షన్ క్లెయిమ్‌లను ఏ ప్రాంతీయ కార్యాలయం ద్వారా అయినా ప్రాసెస్ చేసి, దేశవ్యాప్తంగా వారు కోరుకున్న బ్యాంక్ ఖాతాలో పెన్షన్ పొందే వీలు కల్పించారు.

కొత్త వ్యవస్థకు మారిన నేపథ్యంలో, స్థిరీకరణ కాలం ముగిసే వరకు అంటే మరో రెండు వారాల పాటు క్లెయిమ్‌లపై అదనపు ధృవీకరణలు ఉంటాయి. అందువల్ల కొన్ని సేవలకు సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ సమయంలో ఆన్‌లైన్ సేవలను పదేపదే యాక్సెస్ చేయవద్దని, ఒకే సేవ కోసం బహుళ అభ్యర్థనలను పంపవద్దని ఈపీఎఫ్ఓ సభ్యులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com