దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి

- July 09, 2026 , by Maagulf
దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి

దుబాయ్: దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే బ్లూ లైన్ టన్నెలింగ్ తొలి దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) వెల్లడించింది. అత్యాధునిక స్మార్ట్ ఇంజినీరింగ్ సాంకేతికతను వినియోగించడం వల్ల టన్నెలింగ్ వేగం గతంతో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగిందని అధికారులు తెలిపారు.

దుబాయ్ మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతలు టన్నెల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్‌టీఏ పేర్కొంది. భూగర్భ నిర్మాణ పనుల్లో మరింత ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని సాధించేందుకు స్మార్ట్ సొల్యూషన్లు, అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలను నిరంతరం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.

యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ రెండు నెలల క్రితం బ్లూ లైన్ టన్నెలింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వేగంగా పనులు కొనసాగి, తొలి దశ తవ్వకాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్‌టీఏ ప్రకటించింది.

2007లో దుబాయ్ మెట్రో తొలి ప్రాజెక్టు కోసం టన్నెల్ బోరింగ్ యంత్రాలను వినియోగించడం ప్రారంభమైంది. అప్పట్లో రోజుకు సగటున 12 మీటర్ల చొప్పున మాత్రమే తవ్వకాలు సాగేవి. దీంతో టన్నెలింగ్ తొలి దశ పూర్తి కావడానికి సుమారు ఏడు నెలలు పట్టేది.

ప్రస్తుతం బ్లూ లైన్ ప్రాజెక్టులో 'అల్ వుగైషా' (Al Wugeisha) అనే కొత్త తరం టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక డిజిటల్ గైడెన్స్, మానిటరింగ్ వ్యవస్థలతో కూడిన ఈ యంత్రం రోజుకు సుమారు 30 మీటర్ల వరకు తవ్వకాలు నిర్వహించగలదు. దీంతో కేవలం రెండు నెలల్లోనే తొలి దశ పనులు పూర్తయ్యాయి.

సుమారు 2,000 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు కలిగిన 'అల్ వుగైషా' సాధారణ టన్నెల్ బోరింగ్ యంత్రం మాత్రమే కాదు. ఇది భూగర్భంలో తవ్వకాలు చేపట్టడం, తవ్విన మట్టిని బయటకు తరలించడం, టన్నెల్ లైనింగ్ సెగ్మెంట్లను స్వయంచాలకంగా అమర్చడం వంటి ప్రక్రియలను నిరంతరాయంగా నిర్వహించే సమగ్ర వ్యవస్థగా పనిచేస్తుందని ఆర్‌టీఏ వివరించింది.

గత రెండు దశాబ్దాల కంటే తక్కువ కాలంలో దుబాయ్ టన్నెలింగ్ సాంకేతికత సాధించిన ఈ పురోగతి, భవిష్యత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దుబాయ్ కట్టుబాటును ప్రతిబింబిస్తోందని ఆర్‌టీఏ పేర్కొంది. బ్లూ లైన్ ప్రాజెక్టు పనులు ఇదే వేగంతో కొనసాగుతున్నాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com