గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- July 10, 2026
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై తమ కళాఖండాన్ని ప్రదర్శించాలని కలలు కనే కళాకారులకు ఎమార్ సంస్థ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. 'బుర్జ్ ఖలీఫా ఓపెన్ కాల్ 2026' పేరుతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు యూఏఈతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, డిజైనర్లు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఎంపికైన కళాఖండాన్ని బుర్జ్ ఖలీఫా ఐకానిక్ ఫసాడ్‌పై ప్రదర్శించనుండటంతో విజేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఈ మేరకు ఎమార్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటన విడుదల చేస్తూ, "తదుపరి బుర్జ్ ఖలీఫా ప్రొజెక్షన్‌పై మీ సంతకం ఉండొచ్చు" అంటూ కళాకారులను పాల్గొనాలని ఆహ్వానించింది.
పోటీ నిబంధనల ప్రకారం, పాల్గొనేవారు మూడు నిమిషాల నిడివి గల ఆడియో-విజువల్ ప్రొజెక్షన్ రూపొందించాలి. ఆ రూపకల్పనలో నవీనత, కళాత్మకత, దుబాయ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఉండాలని ఎమార్ సూచించింది.
ఈ పోటీకి దరఖాస్తుల స్వీకరణ జూలై 8, 2026 నుంచి ప్రారంభమై ఆగస్టు 18, 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది.
సమర్పించే వీడియోలు, సంగీతం పూర్తిగా స్వీయ సృష్టిగా ఉండాలని, కాపీరైట్ ఉల్లంఘనలకు తావులేకుండా చూడాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే సాంస్కృతిక విలువలకు అనుగుణంగా ఉండే కంటెంట్‌ను మాత్రమే సమర్పించాలని సూచించారు.
దరఖాస్తుదారులు ముందుగా ఎంపీ4 (MP4) ఫార్మాట్‌లో ప్రివ్యూ వీడియోను సమర్పించాలి. తుది ఎంపికైన ప్రొజెక్షన్‌ను ఎంఓవీ (MOV) ఫార్మాట్‌లో అందించాల్సి ఉంటుంది. ప్రివ్యూ వీడియోలో సంగీతం ఉండటంతో పాటు, ప్రత్యేకంగా కాపీరైట్ రహిత ఆడియో ఫైల్‌ను కూడా జత చేయాలి. అదనంగా, తమ రూపకల్పన వెనుక ఉన్న ఆలోచన, ప్రేరణను వివరిస్తూ 300 పదాలకు మించకుండా కాన్సెప్ట్ నోట్ సమర్పించాలి.
సాంకేతిక వివరాల కోసం అవసరమైన టెంప్లేట్, మార్గదర్శకాలను ఎమార్ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఆసక్తి ఉన్న కళాకారులు తమ వీడియో, కాన్సెప్ట్ వివరణను [email protected] ఇమెయిల్ చిరునామాకు నిర్ణీత గడువులోపు పంపించాలని సంస్థ తెలిపింది.
గత ఏడాది నిర్వహించిన పోటీలో విజేతకు ధర్మ్ 1 లక్ష (Dh100,000) నగదు బహుమతితో పాటు బుర్జ్ ఖలీఫాపై కళాఖండాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించారు. అయితే ఈసారి నగదు బహుమతి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. విజేతకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై తన కళాఖండాన్ని ప్రదర్శించే అవకాశమే ప్రధాన గుర్తింపుగా పేర్కొన్నారు.
మరోవైపు, గత ఏడాది పోటీ యూఏఈ నివాసితులకు మాత్రమే పరిమితమై ఉండగా, ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులందరికీ అవకాశం కల్పించారు. దీంతో అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఎమార్ ఈ ఏడాది పోటీని మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







