ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!

- July 14, 2026 , by Maagulf
ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!

దోహా: ఖతార్‌లో వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగం సహకారాన్ని కోరుతోంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI), సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ బ్యూరో సంయుక్తంగా 'షారెక్' (Sharek) వేదిక ద్వారా 'బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ చాలెంజెస్ సబ్మిషన్ ఫారం'లో పాల్గొనాలని దేశంలోని ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించాయి.

ప్రైవేట్ సంస్థలు ఏడాది పొడవునా ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులను గుర్తించి వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కంపెనీల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడం ద్వారా వ్యాపార రంగానికి సంబంధించిన కీలక అంశాలపై సంబంధిత ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోనున్నాయి.

సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ బ్యూరో 'ఎక్స్' వేదికలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. షారెక్ వేదిక ద్వారా అందే సూచనలు ఖతార్ వ్యాపార వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చడంతో పాటు, దేశీయ మార్కెట్ పోటీతత్వాన్ని పెంచేందుకు దోహదపడతాయి.

వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తల సూచనలు ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచి, నిబంధనలు, ప్రభుత్వ సేవల్లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ సర్వేలో పాల్గొనడం ద్వారా ప్రైవేట్ రంగ అవసరాలకు అనుగుణంగా వినూత్న ప్రభుత్వ సేవలు అభివృద్ధి చేయడంతో పాటు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రైవేట్ కంపెనీలు అధికారిక ప్రచారంలో అందుబాటులో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా షారెక్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com