హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!

- July 14, 2026 , by Maagulf
హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!

రియాద్: యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలీషియా సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకొని ధ్వంసం చేసింది. ఈ మేరకు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న కూటమి (Coalition to Restore Legitimacy in Yemen) ప్రకటించింది. కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ మాట్లాడుతూ..  హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు.

 ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాలకు విరుద్ధమని, పౌరులు, పౌర మౌలిక వసతులు, కీలక ప్రభుత్వ, ఆర్థిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు అంతర్జాతీయ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే విషయానికి మరో ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో కూడా హౌతీలు సౌదీ అరేబియాపై చేస్తున్న బెదిరింపులు యెమెన్ ప్రజలపై జరుగుతున్న ఉల్లంఘనలు, అక్కడి తీవ్ర ఆర్థిక, మానవతా సంక్షోభం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమేనని కూటమి ఆరోపించింది.

సౌదీ అరేబియా, తమ పౌరులు, జాతీయ ఆస్తులు లేదా యెమెన్ సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకునే ఎలాంటి చర్యలకైనా బలంగా తిప్పికొడుతుందని కూటమి స్పష్టం చేసింది. ఈ చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగానే ఉంటాయని వెల్లడించింది.

సౌదీ మద్దతుతో రూపొందిన శాంతి రోడ్‌మ్యాప్‌ను యెమెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, హౌతీలు దానిని తిరస్కరిస్తూనే ఉన్నారని మేజర్ జనరల్ అల్ మాలికీ అన్నారు. అదే సమయంలో రెడ్ సీ, బాబ్ అల్-మండబ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానంపై దాడులను మరింత ఉధృతం చేస్తున్నారని ఆరోపించారు.

అదేవిధంగా, యెమెన్‌లోని ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, కర్మాగారాలు వంటి కీలక మౌలిక వసతులను ప్రమాదంలోకి నెడుతున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. యెమెన్ ప్రజల బాధలను తగ్గించేందుకు, ఆ దేశంలో సమగ్ర రాజకీయ పరిష్కారం సాధించేందుకు సౌదీ అరేబియా తన అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి కట్టుబడి పనిచేస్తుందని కూటమి పునరుద్ఘాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com