సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- July 16, 2026
బంగాళాఖాతంలో రెండు పడవలు మునిగిపోయిన ఘటనలో మయన్మార్‌కు చెందిన దాదాపు 500 మంది రోహింగ్యా శరణార్థులు మరణించి ఉంటారని అంతర్జాతీయ శరణార్థుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం (UNHCR), అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జూన్ నెలాఖరులో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం, బంగ్లాదేశ్ సరిహద్దు శరణార్థుల శిబిరాల నుండి రోహింగ్యాలతో బయలుదేరిన రెండు పడవలు సముద్రంలో ప్రమాదానికి గురయ్యాయి. ఒక పడవ బయలుదేరిన కొద్దిసేపటికే సంబంధాలు తెగిపోగా, 280 మందితో ఉన్న రెండో పడవ జూలై 8న మయన్మార్ తీరంలో మునిగిపోయినట్లు సమాచారం.
సాధారణంగా రోహింగ్యాలు వర్షాకాలంలో సముద్ర ప్రయాణాలు చేయరని, అయితే ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని ఐక్యరాజ్యసమితి సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని కిక్కిరిసిన శరణార్థుల శిబిరాల్లో దాదాపు 12 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాలు విదేశీ సహాయాన్ని భారీగా తగ్గించడంతో ఈ శిబిరాల్లో ఆహార రేషన్ కొరత ఏర్పడింది. మరోవైపు మయన్మార్(Myanmar Boat Accident)లో సైన్యానికి, స్థానిక సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల ప్రాణాలు దక్కించుకోవడానికి వారు ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గం:
ఈ సముద్ర ప్రయాణాల్లో ఇప్పటివరకు గర్భిణులు, పసిపిల్లలతో సహా వేలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ప్రమాదంలో ఉన్న శరణార్థుల పడవలను రక్షించడంలో ప్రాంతీయ నౌకాదళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. UNHCR నివేదిక ప్రకారం, 2025లో 6,500 మందికి పైగా రోహింగ్యాలు సముద్ర మార్గంలో పారిపోవడానికి ప్రయత్నించగా, దాదాపు 900 మంది మరణించారు లేదా అదృశ్యమయ్యారు. శరణార్థుల రక్షణకు, మానవ అక్రమ రవాణా ముఠాల అంతానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







