గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- July 18, 2026
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత నిరంతరం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన పాలకుల ఆశయాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతోంది. ఒక సాధారణ తాగునీటి మోటార్ వివాదంలో అధికార పార్టీ నేత కుటుంబం బరితెగించి, ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తన్నిన వైనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
జరిపిన దాడి.. వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఈ భయానక ఉదంతం వెలుగుచూసింది. కాలనీలో నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ (TDP) సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. ఈ గొడవ కాస్తా ముదరడంతో మల్లెల మూర్తి కుటుంబం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలను సైతం తోడు తెచ్చుకుని సదరు మహిళపై దాడికి దిగారు. అంతటితో ఆగక, నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసి, కాళ్లతో తంతూ చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానక సీసీటీవీ (CCTV) దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే గల్లా మాధవి తక్షణ చర్య.. పార్టీ నుంచి సస్పెన్షన్
ఈ దారుణ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు.బాధితురాలు తలదాచుకోవడానికి తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే, ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కఠిన చర్యలకు ఆదేశించారు. “మహిళల గౌరవం, రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవి, నిందితుడు మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని భరోసా ఇచ్చారు.
కటకటాల్లోకి నిందితులు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
వైరల్ అయిన వీడియో ఆధారంగా నగరంపాలెం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా ప్రభుత్వ నినాదం ఒక్కటే.. పక్షపాతం, భయం లేకుండా చట్టం కఠినంగా అమలు అవుతుంది. రాజకీయ అండదండలు ఉన్నాయనే నెపంతో తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తికీ రక్షణ కల్పించే ప్రసక్తే లేదు.” — నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకవైపు ప్రభుత్వం మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







