దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?

- July 23, 2026 , by Maagulf
దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?

దుబాయ్: దుబాయ్‌కు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను ఆహ్వానించే యూఏఈ నివాసితులకు 3,000 దిర్హామ్‌లకుపైగా విలువైన హోటల్, రెస్టారెంట్, పర్యాటక ఆకర్షణలపై ప్రత్యేక రాయితీలు అందించనున్నట్లు దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ (DET) ప్రకటించింది. "A Dubai Invite" పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం అక్టోబర్ 31వరకు కొనసాగనుంది.

ఎవరు అర్హులు?

* యూఏఈ పౌరులు లేదా 18 ఏళ్లు పైబడిన నివాసితులు

* చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడీ కలిగి ఉండాలి

* ఒకేసారి గరిష్టంగా ఐదుగురు సందర్శకులను నామినేట్ చేయవచ్చు

* మొత్తం కార్యక్రమంలో గరిష్టంగా మూడు రివార్డ్ ప్యాకేజీలను మాత్రమే పొందవచ్చు

విజిటర్స్ ను ఎలా నామినేట్ చేయాలి?

నివాసితులు Visit Dubai అధికారిక వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. అందులో నివాసితుడి వివరాలైన ఎమిరేట్స్ ఐడీ, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ చిరునామాతోపాటు విజిటర్స్ కు సంబంధించిన పేరు, పాస్‌పోర్ట్ నంబర్, జాతీయత,  పుట్టిన తేదీ, నివాసితుడితో సంబంధం,  దుబాయ్‌కు వచ్చే టైమ్ వంటి డిటేయిల్స్ నమోదు చేయాలి.

ఎవరిని నామినేట్ చేయవచ్చు?

* యూఏఈ నివాసితులు కాని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు

* చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసా లేదా వీసా-ఆన్-అరైవల్ అర్హత కలిగి ఉండాలి

* జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్‌కు చేరుకోవాలి

* ఒక సందర్శకుడిని ఒక్కసారి మాత్రమే నామినేట్ చేయవచ్చు

రివార్డులు ఎప్పుడు అందుతాయి?

విజిటర్ దుబాయ్ చేరుకున్న తర్వాత ప్రభుత్వం అధికారిక వ్యవస్థల ద్వారా ఆ సమాచారాన్ని ధృవీకరిస్తుంది. ధృవీకరణ పూర్తయిన అనంతరం అర్హులైన నివాసితులకు ఇ-మెయిల్ ద్వారా రివార్డ్ ప్యాకేజీ వివరాలు పంపిస్తారు. రివార్డులు ఆగస్టు నుంచి జారీ చేయబడతాయి. వాటిని డిసెంబర్ 31వరకు వినియోగించుకోవచ్చు.

రివార్డుల్లో ఏముంటాయి?

అర్హులైన వారికి 3,000 దిర్హామ్‌లకుపైగా విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో

* హోటల్ స్టే పై ప్రత్యేక ఆఫర్లు

* రెస్టారెంట్లలో డిస్కౌంట్లు

* ప్రముఖ పర్యాటక ఆకర్షణలకు రాయితీలు

* ఇతర వినోద, విహార ఆఫర్లు

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

* నామినేషన్ నమోదు చివరి తేదీ సెప్టెంబర్ 30

* నామినేట్ చేసిన విజిటర్స్ అక్టోబర్ 31 లోపు దుబాయ్ చేరుకోవాలి

* విమాన టికెట్లు, వీసా, వసతి, ప్రయాణ ఖర్చులను సందర్శకులే భరించాలి

* ఈ కార్యక్రమం ద్వారా వీసా సహాయం అందించబడదు

* అన్ని ఆఫర్లు అందుబాటు మరియు నిబంధనలకు లోబడి ఉంటాయి.

దుబాయ్ టూరిస్ట్ వీసాలు.. రకాలు, ఫీజులు, నిబంధనలు

యూఏఈకి వచ్చే విదేశీ పర్యాటకుల కోసం దుబాయ్ పలు రకాల టూరిస్ట్ వీసా సౌకర్యాలను అందిస్తోంది. 80కి పైగా దేశాల పౌరులు వీసా-ఆన్-అరైవల్ సదుపాయాన్ని పొందవచ్చు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులకు వీసా అవసరం లేదు. GCC నివాసితులు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అన్ని దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు 48 గంటలు లేదా 96 గంటల ట్రాన్సిట్ వీసాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పర్యాటకులు సింగిల్ ఎంట్రీ లేదా మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను ఎంచుకోవచ్చు. సాధారణంగా వీసా ప్రాసెసింగ్ 48 గంటల్లో పూర్తవుతుంది. యూఏఈలోనే ఉండి టూరిస్ట్ వీసాను మొత్తం 120 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా

సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాతో దుబాయ్‌లో 30 లేదా 60 రోజుల పాటు ఒకసారి మాత్రమే ప్రవేశం పొందవచ్చు. ఈ వీసాను గుర్తింపు పొందిన ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు లేదా అధీకృత వీసా సేవా సంస్థల ద్వారా పొందవచ్చు.

అవసరమైన పత్రాలు: కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, * హెల్త్ ఇన్సూరెన్స్

ఫీజులు:

* 30 రోజుల వీసా: 200 దిర్హామ్‌లు

* 60 రోజుల వీసా: 300 దిర్హామ్‌లు

* వీటికి అదనంగా 5 శాతం వ్యాట్ (VAT) వర్తిస్తుంది.

మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా

ఈ వీసాతో 30 లేదా 60 రోజుల చెల్లుబాటు కాలంలో ఎన్నిసార్లైనా యూఏఈలోకి ప్రవేశించి తిరిగి వెళ్లవచ్చు. యూఏఈలో లైసెన్స్ పొందిన టూరిజం సంస్థ లేదా స్పాన్సర్ ద్వారా ఈ వీసా పొందాలి. అవసరమైన వీసా ఫీజుతో పాటు, కొన్ని సందర్భాల్లో భద్రతా డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజులు:

* 30 రోజుల మల్టిపుల్ ఎంట్రీ వీసా: 300 దిర్హామ్‌లు

* 60 రోజుల మల్టిపుల్ ఎంట్రీ వీసా: 500 దిర్హామ్‌లు

* వీటికి అదనంగా 5 శాతం వ్యాట్ (VAT) వర్తిస్తుంది.

ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా

ఈ వీసాతో విదేశీయులు ఐదేళ్ల పాటు యూఏఈకి పలుమార్లు ప్రయాణించవచ్చు. స్పాన్సర్ లేదా గ్యారంటర్ అవసరం ఉండదు. ప్రతి సందర్శనలో 30, 60 లేదా 90 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకేసారి గరిష్టంగా 90 రోజులు ఉండవచ్చు. అవసరమైతే మరో 90 రోజులు పొడిగించుకోవచ్చు. అయితే ఒక ఏడాదిలో మొత్తం బస 180 రోజులు మించకూడదు.

వీసా ఫీజు:

* మొత్తం 3,713.5 దిర్హామ్‌లు (దరఖాస్తు, జారీ ఫీజులు మరియు 3,000 దిర్హామ్‌ల భద్రతా డిపాజిట్ సహా)

యూఏఈలో ఉండి దరఖాస్తు చేస్తే వర్తించే అదనపు చార్జీలు:

* నాలెడ్జ్ దిర్హామ్: 10 దిర్హామ్‌లు

* ఇన్నోవేషన్ దిర్హామ్: 10 దిర్హామ్‌లు

* యూఏఈలో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు: 500 దిర్హామ్‌లు

గమనిక: దరఖాస్తుదారుడి వ్యక్తిగత పరిస్థితులు లేదా ఇతర సంబంధిత అంశాల ఆధారంగా మొత్తం వీసా ఫీజులో మార్పులు ఉండవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com