వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!

- July 24, 2026 , by Maagulf
వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!

కువైట్ సిటీ: దేశంలో వాణిజ్య నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి తనిఖీ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసింది. వాణిజ్య నియంత్రణ విభాగం అధికారులు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే తనిఖీల్లో పోలీసు సిబ్బంది కూడా పాల్గొనేలా నిర్ణయించారు. దీంతో తనిఖీ బృందాలకు భద్రత, చట్టపరమైన సహకారం మరింత బలోపేతం కానుంది.

వాణిజ్య నియంత్రణ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్-అన్సారి మాట్లాడుతూ, తీవ్రమైన వాణిజ్య ఉల్లంఘనలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైతే తక్షణ బహిష్కరణ (డిపోర్టేషన్) చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా, దేశంలోని 71 సహకార సంఘాలు (Cooperative Societies) మరియు సరఫరా కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించే వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర నియంత్రణ గదిని (Central Operations Room) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా భద్రతా పర్యవేక్షణ మరింత బలోపేతం కావడంతో పాటు, సహకార సంఘాలు, సరఫరా కేంద్రాల కార్యకలాపాలపై సమర్థవంతమైన నిఘా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com