ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!

- July 24, 2026 , by Maagulf
ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!

దోహా: ఖతార్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. 2026 జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ చెల్లింపు వ్యవస్థల ద్వారా 75.135 మిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ QR 99.101 బిలియన్ గా నమోదైనట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో నమోదైన 62.074 మిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడమే దీనికి కారణమని QCB తెలిపింది.

మొత్తం లావాదేవీల్లో కార్డ్ చెల్లింపులే 89.2 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి. అయితే అధిక విలువ కలిగిన లావాదేవీలు ఎక్కువగా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థల ద్వారా జరగడంతో, మొత్తం లావాదేవీల విలువలో ట్రాన్స్‌ఫర్ పేమెంట్‌ల వాటా 76.8 శాతానికి చేరింది.

2025 జూన్‌లో QR70.585 బిలియన్ గా ఉన్న మొత్తం లావాదేవీల విలువ, ఈ ఏడాది QR99.101 బిలియన్ కు పెరిగి 40 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో 66.996 మిలియన్ కార్డ్ లావాదేవీలు నమోదయ్యాయి. పాయింట్ ఆఫ్ సేల్ (POS) లావాదేవీలు 48.743 మిలియన్లకు, ఆన్‌లైన్ (ఈ-కామర్స్) లావాదేవీలు 13.235 మిలియన్లకు పెరిగాయి. అయితే ATM లావాదేవీలు స్వల్పంగా తగ్గి 5.019 మిలియన్లకు చేరాయి.

ఖతార్ మొబైల్ పేమెంట్ (QMP) ద్వారా జరిగే ఇన్‌స్టంట్ ట్రాన్స్‌ఫర్ సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సేవల ద్వారా జూన్‌లో QR387.533 మిలియన్ విలువైన లావాదేవీలు నమోదవగా, లావాదేవీల సంఖ్య 7.98 లక్షలకు చేరింది. అలాగే నమోదైన డిజిటల్ వాలెట్ల సంఖ్య 1.450 మిలియన్లకు పెరిగింది.

ఇక ఫర్వాన్ (Fawran) ఇన్‌స్టంట్ పేమెంట్ సేవలో 3.884 మిలియన్ నమోదిత ఖాతాలు ఉండగా, QR6.745 బిలియన్ విలువైన 3.886 మిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. బ్యాంక్ ఖాతాల మధ్య నిధుల బదిలీకి ఉపయోగించే తహ్వీల్ (Tahweel) వ్యవస్థలో కూడా భారీ వృద్ధి నమోదై, QR68.963 బిలియన్ విలువైన 3.463 మిలియన్ లావాదేవీలు జరిగాయి.

ఖతార్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌ఫర్ సేవలు, డిజిటల్ వాలెట్ల వినియోగం మరింత పెరుగుతున్నాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com