45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- July 25, 2026
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాన్సిట్ ప్రాంతంలో 45 రోజుల పాటు తలదాచుకుని పోలీసులను తప్పించుకోవాలని ప్రయత్నించిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతడు దుబాయ్‌లో డ్రగ్స్ సరఫరా ప్రణాళికను కూడా భగ్నం చేశారు. దుబాయ్ పోలీసుల యాంటీ నార్కోటిక్స్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ బిన్ మువైజా ఈ వివరాలను ఓ పోడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. దేశంలోకి అధికారికంగా ప్రవేశించకపోవడంతో పోలీసులు తనను గుర్తించలేరని నిందితుడు భావించి ట్రాన్సిట్ ప్రాంతంలోనే ఉండిపోయాడని తెలిపారు.
అయితే యాంటీ నార్కోటిక్స్ అధికారులు అతని కదలికలు, రోజువారీ కార్యకలాపాలు, పరిచయాలు, కమ్యూనికేషన్‌పై నిరంతరం నిఘా ఉంచారు. దుబాయ్‌లో దాచిన డ్రగ్స్‌ను ఇతరుల ద్వారా కొనుగోలుదారులకు చేరవేయడానికి అతడు విదేశాల్లోని వ్యక్తులతో సమన్వయం చేస్తున్నట్లు గుర్తించారు. అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం, డ్రగ్స్‌ను బయటకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల కేసుల్లో నిఘా సమాచారం, నేరచరిత్ర, సంబంధాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని బ్రిగేడియర్ ఖాలిద్ చెప్పారు.
మాదకద్రవ్యాల వ్యసనం.. స్మగ్లింగ్‌కు దారి డ్రగ్స్‌కు బానిసైన కొందరు వ్యక్తులు ఎక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు కొనుగోలు చేయాల్సి రావడంతో, డబ్బు కోసం చివరకు డ్రగ్స్ విక్రయించే నెట్‌వర్క్‌లో చేరుతున్నారని ఆయన వివరించారు. దాదాపు ఒక కిలో మాదకద్రవ్యాలతో పట్టుబడిన ఓ మహిళ మొదట డ్రగ్స్ వినియోగదారుగా ఉండి, తర్వాత సరఫరాదారుడి ప్రలోభాలకు లోనై డ్రగ్స్ పంపిణీదారుగా మారిన ఘటనను ఉదాహరణగా చెప్పారు. అలాగే 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు విదేశాల నుంచి గంజాయి ఆయిల్ తెప్పించి, ఈ-సిగరెట్లలో నింపి విక్రయించిన కేసులను కూడా పోలీసులు ఛేదించారని వెల్లడించారు.
నాలుగేళ్ల పాటు సాగిన దర్యాప్తు మరో కీలక కేసులో, యూఏఈకి చెందిన ఓ ప్రముఖ డ్రగ్స్ స్మగ్లర్‌పై నాలుగేళ్ల పాటు దర్యాప్తు జరిపిన తర్వాతే కేసును ఛేదించినట్లు బ్రిగేడియర్ ఖాలిద్ తెలిపారు. అతని నెట్‌వర్క్ సూడాన్, ఈజిప్ట్‌తో పాటు పలు ఆఫ్రికా దేశాలకు విస్తరించి ఉందని చెప్పారు. అంతర్జాతీయ నిఘా సంస్థల సహకారం, నిరంతర నిఘా, పటిష్ఠ ఆధారాల సేకరణతో కేసును ఫెడరల్ కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు వివరించారు.డ్రగ్స్ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ, యాంటీ నార్కోటిక్స్ బృందాలు కూడా ఆధునిక నిఘా, అనుభవం, అంతర్జాతీయ సహకారంతో వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నాయని బ్రిగేడియర్ ఖాలిద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







