పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

- July 25, 2026 , by Maagulf
పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలలో జరుగుతున్న పేపర్ లీకేజీలు, వివిధ రకాల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పరీక్షా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా రూపొందించిన సవరణ బిల్లు డ్రాఫ్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాబోయే సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. పారదర్శకమైన పరీక్షల నిర్వహణే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను చేర్చారు.

సాధారణ అక్రమాలకు పెరిగిన జైలు శిక్ష, జరిమానా

నూతన సవరణల ప్రకారం పరీక్షల్లో సాధారణ అక్రమాలకు పాల్పడినా శిక్షలు మునుపటి కంటే చాలా కఠినంగా ఉండనున్నాయి. గతంలో ఉన్న శిక్షా కాలాన్ని పెంచి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా మార్పులు చేశారు. సాధారణ అక్రమాలకు జరిమానా మొత్తాన్ని రూ. 50 లక్షల వరకు పెంచారు.

పేపర్ లీక్ గ్యాంగ్‌లకు రూ. 10 కోట్ల పెనాల్టీ

పరీక్షలను వ్యాపారంగా మార్చుకుని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకునే ఆర్గనైజ్డ్ ముఠాలు మరియు సర్వీస్ ప్రొవైడర్లపై అత్యంత కఠినమైన చర్యలకు ప్రతిపాదించారు. పేపర్ లీకేజ్ గ్యాంగ్‌లకు ఏకంగా రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు తప్పులకు పాల్పడితే రూ. 5 కోట్ల జరిమానా విధించడంతో పాటు వారిని 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్ (Blacklist) చేయనున్నారు.

ఈ సవరణ బిల్లులో కేసుల విచారణకు సంబంధించి అత్యంత ముఖ్యమైన నిబంధనను చేర్చారు. పరీక్షల అక్రమాలకు సంబంధించి కేసు నమోదైన నాటి నుంచి 2 నెలల వ్యవధిలోనే విచారణను పూర్తి చేసేలా చట్టంలో స్పష్టమైన సవరణలు చేశారు. దీని ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్షలు పడటంతో పాటు బాధితులకు వేగంగా న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com