మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!

- July 25, 2026 , by Maagulf
మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!

అబుదాబి: మహిళను హత్య చేసి, మరో వ్యక్తిని హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడికి విధించిన మరణశిక్షను యూఏఈ ఫెడరల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిందితుడికి తన వాదనలు వినిపించుకునే హక్కు (రైట్ టు డిఫెన్స్) పూర్తిగా కల్పించలేదని పేర్కొంటూ, కేసును కొత్త న్యాయమూర్తుల ధర్మాసనం ముందు తిరిగి విచారణకు పంపింది.

కోర్టు రికార్డుల ప్రకారం.. ఈ కేసులో నిందితుడిపై ముందస్తు ప్రణాళికతో మహిళను హత్య చేయడం, మరో వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించడం, అలాగే మృతురాలితో అక్రమ సంబంధం కలిగి ఉండటం వంటి మూడు అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమోదు చేసింది.

దర్యాప్తు ప్రకారం..  నిందితుడు ముందుగానే సీజర్లను కొనుగోలు చేసి, వాటిని దాచిపెట్టి, తాను నివసిస్తున్న భవనం పైకప్పుకు వెళ్లే మెట్ల వద్ద మహిళ ఒంటరిగా వచ్చిన సమయంలో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మరో వ్యక్తిపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేయగా, అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డాడు.

విచారణ అనంతరం ట్రయల్ కోర్టు నిందితుడికి హత్య కేసులో ఖిసాస్ (Qisas) ప్రకారం మరణశిక్ష, హత్యాయత్నం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, మూడో అభియోగంలో ఒక నెల జైలు శిక్ష విధించింది. నేరానికి ఉపయోగించిన సీజర్ ను స్వాధీనం చేసుకోవాలని, కోర్టు ఖర్చులు చెల్లించాలని, జైలు శిక్ష పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కూడా ఆదేశించింది.

అయితే ఈ తీర్పుపై నిందితుడు ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు హత్య చేసే ఉద్దేశం లేదని, సంఘటన సమయంలో తన మానసిక స్థితిని నిర్ధారించేందుకు మానసిక వైద్య పరీక్ష నిర్వహించాలని కోరాడు. అలాగే తీవ్ర రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని, ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు నిరూపించలేదని వాదించాడు.

ఈ కీలక అభ్యర్థనలను అప్పీల్ కోర్టు పరిశీలించకుండా, వాటిని ఎందుకు తిరస్కరించిందో సరైన కారణాలు కూడా వెల్లడించలేదని ఫెడరల్ సుప్రీంకోర్టు గుర్తించింది. మరణశిక్ష అమలు చేయడానికి ముందు ప్రతి కేసును ఫెడరల్ సుప్రీంకోర్టు తప్పనిసరిగా సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.

నిందితుడి రక్షణ హక్కులకు భంగం కలిగిందని తేల్చిన సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టు తీర్పును రద్దు చేసి, వేరే న్యాయమూర్తుల ధర్మాసనం ముందు కేసును మళ్లీ విచారించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com