నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- July 26, 2026
నేపాల్: సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లే భారతీయ పర్యాటకులకు, అలాగే వ్యాపార, ఉద్యోగ నిమిత్తం భారత్‌కు వచ్చి వెళ్లే నేపాల్ పౌరులకు ఆ దేశ కేంద్ర బ్యాంక్ నేపాల్ రాష్ట్రా బ్యాంక్ (NRB) భారీ ఊరటనిచ్చింది. ఇరుదేశాల మధ్య నిత్యం సాగే ప్రయాణాలు, సరిహద్దు వ్యాపార లావాదేవీలను మరింత సులభతరం చేసేలా ఇండియన్ కరెన్సీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారత్, నేపాల్ పౌరులు ఎవరైనా సరే తమ వెంట గరిష్టంగా 25,000 రూపాయల వరకు భారత కరెన్సీని నేపాల్‌లోకి తీసుకెళ్లడానికి లేదా అక్కడ నుంచి భారత్‌కు తీసుకురావడానికి అనుమతి లభించింది.
కొత్త నిబంధనలు & షరతులు
రూ. 200, రూ. 500 నోట్లకు సడలింపు:
2016 నవంబర్ 9 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన రూ. 200 మరియు రూ. 500 నోట్లకు మాత్రమే ఈ 25,000 రూపాయల సడలింపు వర్తిస్తుంది. ఇకపై సరిహద్దు తనిఖీల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.
పాత పెద్ద నోట్ల పై నిషేధం యథాతథం:
2016 డీమోనిటైజేషన్ సమయంలో రద్దయిన పాత రూ. 500, రూ. 1000 నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడంపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ఎన్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. పాత నోట్లను తెస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మూడో దేశానికి భారత కరెన్సీ తీసుకెళ్లడం నిషిద్ధం:
నేపాల్ వాసులు కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఈ ఇండియన్ కరెన్సీని తమ దేశానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నేపాల్ నుంచి ఇతర మూడో దేశానికి (Third Country) వెళ్లేటప్పుడు ఈ భారతీయ రూపాయిలను వెంట తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
విదేశీ కరెన్సీ / డాలర్ పరిమితి:
భారత్ మినహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 5,000 అమెరికన్ డాలర్ల (లేదా దానికి సమానమైన ఇతర విదేశీ కరెన్సీ) వరకు ఎలాంటి కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా నేపాల్‌లోకి తెచ్చుకోవచ్చు. ఆ పరిమితి దాటితే కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది.
పర్యాటకరంగం, సరిహద్దు వ్యాపారానికి బూస్ట్
ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి నేపాల్ వెళ్లే వేలాది మంది టూరిస్టులకు, విద్యా, ఉద్యోగ నిమిత్తం భారత్‌లో ఉండే నేపాల్ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడేల్ తెలిపారు. ఓపెన్ బోర్డర్ కలిగిన ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఈ నిర్ణయంతో మరింత బలపడతాయని విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







