వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- July 27, 2026
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కొత్త అధికారిక డ్రెస్ కోడ్‌ను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధీ ఈ ఏడాది జనవరి 21న జారీ చేసిన మంత్రి స్థాయి నిర్ణయం మేరకు ఈ నిబంధనలు అమలవుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వైద్య సిబ్బంది వృత్తిపరమైన గుర్తింపును బలోపేతం చేయడం, ఉద్యోగ విభాగాలకు అనుగుణంగా ఏకరీతి దుస్తుల విధానాన్ని అమలు చేయడం, రోగులు వైద్య బృందంలోని సభ్యులను సులభంగా గుర్తించేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపింది. అలాగే కార్యాలయ క్రమశిక్షణను పెంపొందించడం, మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడం, నాణ్యమైన వైద్య సేవలను అందించడంతో పాటు సామాజిక విలువలను గౌరవించడం కూడా లక్ష్యంగా పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం వైద్య సిబ్బంది తప్పనిసరిగా అధికారిక గుర్తింపు కార్డు ధరించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు కనిపించే టాటూలను విధి నిర్వహణ సమయంలో కప్పి ఉంచాలి. శుభ్రమైన, మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించాలి. అనుచిత నినాదాలు లేదా ప్రకటనలు ఉన్న దుస్తులు, స్పోర్ట్స్‌వేర్, షార్ట్‌లు, చిరిగిన దుస్తులు, స్పోర్ట్స్ క్యాప్‌లు, పెద్ద లోగోలు ఉన్న లేదా ఆకర్షణీయ రంగుల చెప్పులు ధరించడాన్ని నిషేధించారు. సిబ్బంది శుభ్రమైన ఫార్మల్ షూస్ లేదా ఒకే రంగులో ఉండే స్పోర్ట్స్ షూస్ మాత్రమే ధరించాలని సూచించారు.
ఈ డ్రెస్ కోడ్‌ను పాటించని వారిపై నిబంధనల ప్రకారం ఉల్లంఘన కేసుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అదే సమయంలో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్లు, అత్యవసర వైద్య సేవల సిబ్బంది, సహాయక వైద్య సిబ్బంది, ఇంజినీరింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక యూనిఫామ్‌లను కూడా ఆమోదించింది. పురుషులు, మహిళలు, ఇస్లామిక్ మహిళల కోసం మూడు రకాల క్లినికల్ స్క్రబ్ డిజైన్లతో పాటు నర్సింగ్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఇంజినీరింగ్ సిబ్బందికి వారి విధులకు అనుగుణంగా ప్రత్యేక యూనిఫామ్‌లను రూపొందించింది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







