యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!

- July 29, 2026 , by Maagulf
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలతో చర్చనీయాంశమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై సభలో తీవ్ర గందరగోళం నెలకొనగా, విపక్ష సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై ఎవరైనా పేపర్ లీక్ పాల్పిడితే శిక్షలు చాలా కఠినంగా ఉండనున్నాయి. అందులో మొదటిగా పేపర్ లీక్ పాల్పడినవారికి 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. అలాగే రూ. 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు.

కొత్తగా ఆమోదం పొందిన ఈ బిల్లు, పేపర్ లీక్ కేసుల దర్యాప్తును పూర్తిచేసేందుకు 2 నెలల గడువును నిర్దేశించింది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 2024 చట్టంలోని ఐదేళ్ల శిక్షను, 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు 10 ఏళ్లకు పెంచింది.

కేసులను 3 నెలల వ్యవధిలో పరిష్కరించేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. వ్యవస్థీకృత నేరస్థులకు విధించే గరిష్ట జరిమానాను ప్రస్తుత చట్టంలోని పరిమితి నుంచి రూ. 10 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.

సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు:
అంతకుముందు సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాల్పులు జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ‘నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు.. సాక్ష్యాలు ఉంటే సభ ముందు ఉంచాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి’ అంటూ సవాల్ విసిరారు.

రాహుల్ వ్యాఖ్యలతో సభలో దుమారం:
రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిన అధికారపక్ష ఎంపీలు, ఆయన వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ పరిణామాలతో లోక్‌సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ గందరగోళం మధ్యే యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదించింది. పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ యాంటి పేపర్ బిల్లుపై సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.

గురువారానికి ఉభయసభలు వాయిదా:
యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. వందేమాతరం సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ జూలై 30కి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com