పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి

- July 29, 2026 , by Maagulf
పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి

న్యూఢిల్లీ: భారత తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ సేవలపై విధిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను తొలగించాలని మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు శ్రీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని ఆయన లోక్‌సభలో ప్రస్తావిస్తూ, సాధారణ తపాలా సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పటికీ, స్పీడ్ పోస్ట్‌తో పాటు ఇతర పోస్టల్ సేవలపై జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ, ప్రస్తుతం పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, బుక్‌పోస్ట్, 10 గ్రాముల లోపు సాధారణ తపాలా కవర్లు వంటి సేవలకు మాత్రమే జీఎస్టీ మినహాయింపు వర్తిస్తోందని తెలిపారు. అదేవిధంగా, భారత తపాలా శాఖ అందిస్తున్న జీవిత బీమా సేవలు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు పొందుతున్నాయని వెల్లడించారు.

అయితే, స్పీడ్ పోస్ట్‌తో పాటు మినహాయింపు జాబితాలో లేని ఇతర పోస్టల్ సేవలన్నీ ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందిస్తున్న భారత తపాలా శాఖపై జీఎస్టీ భారం తగ్గించడం అవసరమన్నారు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీ పడేలా స్పీడ్ పోస్ట్‌తో పాటు మరిన్ని పోస్టల్ సేవలకు కూడా జీఎస్టీ మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, స్పీడ్ పోస్ట్ (ఈఎంఎస్), అంతర్జాతీయ పోస్టల్ సేవలు, దేశీయ బుక్ ప్యాకెట్లు, రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, 20 గ్రాముల వరకు లేఖలు తదితర సేవలకు జీఎస్టీ మినహాయింపు కల్పించాలని తపాలా శాఖ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ)కి పలుమార్లు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించింది.

పార్లమెంట్ వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, జీఎస్టీ మినహాయింపు అమలైతే ప్రజలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులతో పాటు తపాలా సేవలను ఉపయోగించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. పోస్టల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com