బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- August 03, 2026
మనామా: బైక్‌లు, సైకిళ్లు, స్కూటర్ల చోరీలకు పాల్పడుతూ ఇప్పటికే పలుమార్లు కేసులు ఎదుర్కొన్న ఓ 26 ఏళ్ల బహ్రెయిన్ యువకుడు మరోసారి కోర్టు ముందులో హాజరయ్యాడు. ఈసారి బైక్‌ను దొంగిలించడమే కాకుండా యజమాని మొబైల్‌లోని డిజిటల్ బ్యాంకింగ్ యాప్‌ను ఉపయోగించి డబ్బు బదిలీ చేసిన కేసులో హై క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, నిందితుడు గుడైబియా ప్రాంతంలో నివసిస్తున్న 46 ఏళ్ల భారతీయుడి మోటార్‌సైకిల్‌ను దొంగిలించాడు. బైక్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని BenefitPay యాప్‌ను సులభమైన పిన్ నంబర్ (123456) సహాయంతో తెరిచి, తన ఖాతాకు 260.400 బహ్రెయిన్ దినార్లు బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు రాత్రి తన అపార్ట్‌మెంట్ బయట బైక్‌ను పార్క్ చేసిన అనంతరం అది కనిపించకుండా పోయిందని తెలిపాడు. కొద్దిసేపటికే తన ఖాతా నుంచి మూడు విడతల్లో డబ్బు బదిలీ అయినట్లు మొబైల్‌లో నోటిఫికేషన్లు వచ్చాయని, అయితే ఆ లావాదేవీలు తాను చేయలేదని కోర్టుకు వెల్లడించాడు.
బ్యాంకు సమర్పించిన వివరాల ప్రకారం, బదిలీ అయిన మొత్తం నిందితుడి ఖాతాలోకే వెళ్లినట్లు నిర్ధారణ అయింది. విచారణలో నిందితుడు డబ్బు బదిలీ చేసిన విషయాన్ని అంగీకరించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. సీసీటీవీ కెమెరాల్లో కూడా అతడి కదలికలు నమోదైనట్లు పేర్కొంది.
నిందితుడిపై బాధితుడి ఎలక్ట్రానిక్ సంతకాన్ని దుర్వినియోగం చేయడం, అనుమతి లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ ఖాతాలోకి ప్రవేశించడం, మోసపూరితంగా డబ్బు కాజేయడం, ఆస్తి చోరీ వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు.
కోర్టు రికార్డుల ప్రకారం, నిందితుడు గతంలో బజాజ్, అప్రిలియా, కావాసాకి, సుజుకి తదితర కంపెనీల బైక్‌లతో పాటు మరికొన్ని వాహనాల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నాలుగు బైక్ చోరీ కేసుల్లో ఇప్పటికే ఏడాది ఎనిమిది నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ ఘటన అనంతరం కూడా మరో నాలుగు మోటార్‌సైకిళ్లను దొంగిలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







