25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్‌

- August 05, 2026 , by Maagulf
25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్‌

హైదరాబాద్: హైదరాబాద్ లో కల్తీ మసాలా తయారీ కేంద్రాలే లక్ష్యంగా H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందాలు మెరుపు దాడులు నిర్వహించినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ సోదాల్లో 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

తనిఖీల్లో వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి నిత్యం వాడే మసాలా దినుసుల్లో తీవ్రస్థాయిలో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించామని సజ్జనార్ తెలిపారు. ఆకర్షణీయమైన మెరుపు, రంగు కోసం ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారని వివరించారు. దాడుల సందర్భంగా సుమారు 89 టన్నుల ముడి పదార్థాలను సీజ్ చేసి, నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించామని తెలిపారు. కల్తీరాయుళ్లపై ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇలాంటి రసాయనాలతో కూడిన కల్తీ మసాలాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, తీవ్రమైన అలర్జీలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. H-FAST బృందం ఏర్పడిన 140 రోజుల్లోనే 659 ప్రాంతాల్లో సోదాలు చేసి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. నగరంలో కల్తీ ఆహారంపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com