మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్‌కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం

- August 06, 2026 , by Maagulf
మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్‌కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం

అబుదాబి: ఇరాన్ దాడుల నేపథ్యంలో గత మూడు వారాలుగా నిలిపివేసిన బహ్రెయిన్ మరియు కువైట్ విమాన సర్వీసులను ఎతిహాద్ ఎయిర్‌వేస్ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 8 (శనివారం) నుంచి ఈ రెండు దేశాలకు విమానాలు తిరిగి నడవనున్నాయి.

ఎతిహాద్ ఫ్లైట్ స్టేటస్ ప్రకారం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (EY643), అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (EY653) వెళ్లే విమానాలు శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం సేవలు అందించనున్నాయి.

ఇంతకుముందు "ఆపరేషనల్ కారణాలు" చూపుతూ బహ్రెయిన్, కువైట్‌కు విమానాలను రద్దు చేసినట్లు ఎతిహాద్ తెలిపింది. గత కొన్ని వారాల్లో సౌదీ అరేబియాలోని దమ్మామ్ వెళ్లే కొన్ని విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి.

జూలై 16న బహ్రెయిన్‌కు బయలుదేరిన ఎతిహాద్ విమానం భద్రతా పరిస్థితుల కారణంగా మధ్యలోనే తిరిగి అబుదాబికి చేరుకోవాల్సి వచ్చింది. అనంతరం బహ్రెయిన్ నుంచి అబుదాబికి రావాల్సిన రిటర్న్ సర్వీసును కూడా సంస్థ రద్దు చేసింది.

అదే సమయంలో పొరుగు దేశమైన ఇరాన్ దాడుల ప్రభావంతో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ రెండు గమ్యస్థానాలకు ఎతిహాద్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగస్టు 8 నుంచి బహ్రెయిన్, కువైట్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా విమాన షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించాలని ఎయిర్‌లైన్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com