ఆన్‌లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!

- August 06, 2026 , by Maagulf
ఆన్‌లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!

మస్కట్: ఒమాన్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ ట్రావెల్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ఎయిర్‌లైన్, హోటల్, ట్రాన్స్‌పోర్ట్ బుకింగ్ వెబ్‌సైట్లు సృష్టించి బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, డబ్బును కాజేస్తున్నారని తెలిపారు. వేసవి సెలవుల అనంతరం చాలామంది స్వదేశానికి తిరిగి వచ్చినప్పటికీ, ఏడాది పొడవునా విదేశీ ప్రయాణాలు కొనసాగుతుండటంతో ఈ తరహా మోసాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

ప్రపంచ సైబర్ భద్రత సంస్థ కాస్పెర్ స్కై వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 రెండో త్రైమాసికం నుంచి 2026 తొలి త్రైమాసికం వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ల పేర్లను దుర్వినియోగం చేస్తూ దాదాపు 2.70 లక్షల సైబర్ దాడి ప్రయత్నాలను గుర్తించారు. వీటిలో ఎక్కువగా విమానయాన సంస్థలు, రవాణా సేవల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ ప్రచారాలు నిర్వహించినట్లు వెల్లడించింది.

ఈ దాడుల్లో ప్రధానంగా బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ట్రోజన్ మాల్వేర్ ఉపయోగించినట్లు నిపుణులు తెలిపారు. దీంతో బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా యాక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ప్రముఖ యూరోపియన్ విమానయాన సంస్థ రయనైర్ పేరుతో ప్రయాణికులకు నకిలీ పరిహార సందేశాలు పంపి, రీఫండ్ కోసం అకౌంట్ వివరాలు లేదా చిన్న మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరినట్లు కాస్పెర్ స్కై వెల్లడించింది. అయితే నిజమైన విమానయాన సంస్థలు పరిహారం కోసం ముందస్తు చెల్లింపులు ఎప్పుడూ కోరవని స్పష్టం చేసింది.

హోటల్ బుకింగ్ సేవలు కూడా సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా మారాయని, ఇదే కాలంలో హోటల్, ట్రావెల్ బుకింగ్ సేవలకు సంబంధించిన 5,400కుపైగా సైబర్ అటాక్ ప్రయత్నాలు నమోదయ్యాయని తెలిపింది. ఒక ఘటనలో Booking.com పేరుతో నకిలీ చెల్లింపు పేజీ రూపొందించి, ప్రయాణికుల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అసలు బుకింగ్ లేదని తెలిసి పలువురు మోసపోయినట్లు గుర్తించారు.

సైబర్ భద్రత నిపుణులు ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. బుకింగ్‌లు ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ మొబైల్ యాప్‌ల ద్వారానే చేయాలని, చెల్లింపులకు ముందు వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈమెయిల్, ఎస్‌ఎంఎస్ లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద ట్రావెల్ ఆఫర్లపై స్పందించవద్దని, అలాగే భద్రత లేని పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లలో ఆర్థిక లావాదేవీలు చేయవద్దని హెచ్చరించారు.

సీపీఏ హెచ్చరిక

ఒమాన్ వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CPA) కూడా ప్రజలు ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల చిరునామాలు తప్పనిసరిగా httpsతో ప్రారంభమై .gov.omతో ముగియాలని పేర్కొంది. ఫిర్యాదులు, ఆన్‌లైన్ లావాదేవీలు అధికారిక పోర్టల్ ద్వారానే నిర్వహించాలని, వెబ్‌సైట్ చిరునామాలో స్వల్ప మార్పులు కనిపించినా అది ఫిషింగ్ వెబ్‌సైట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రయాణ బుకింగ్‌ను ఖరారు చేసే ముందు రద్దు, మార్పు నిబంధనలను పరిశీలించాలని, అలాగే వసతి, రిజర్వేషన్ వివరాలను మరోసారి ధృవీకరించుకోవాలని సీపీఏ సూచించింది.

ఇటీవల ధోఫార్‌లో జరిగిన ఓ ఘటనలో లగ్జరీ విదేశీ టూర్ ప్యాకేజీల పేరుతో భారీ తగ్గింపులు చూపించిన నకిలీ ట్రావెల్ ఏజెన్సీ పలువురు నివాసితులను మోసం చేసి పరారైంది. ఒక్కో బాధితుడు 100 ఒమానీ రియాల్స్ నుంచి 1,500 ఒమానీ రియాల్స్‌కు పైగా నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. సూపర్ మార్కెట్ల వద్ద లక్కీ డ్రా కూపన్ల పేరుతో కుటుంబాలను ఆకర్షించి, అనంతరం ఎంపికైన 5,000 కుటుంబాల్లో మీరు ఒకరు అంటూ ఫోన్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com