పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్‌కు జైలు శిక్ష ఖరారు..!!

- August 07, 2026 , by Maagulf
పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్‌కు జైలు శిక్ష ఖరారు..!!

మనామా: ఇంగ్లిష్ తెలియని పారిశుద్ధ్య కార్మికులను మోసగించి వారి పేర్లతో నకిలీ రాజీనామా లేఖలు సమర్పించిన కేసులో ఓ మేనేజర్‌కు విధించిన జైలు శిక్షను బహ్రెయిన్ సుప్రీంకోర్టు సమర్థించింది. కెన్యాకు చెందిన 41 ఏళ్ల మేనేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో హై క్రిమినల్ కోర్టు అతడికి నకిలీ పత్రాల తయారీ (ఫోర్జరీ) కేసులో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 5,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. అనంతరం అతడు కోర్టులో హాజరై తన వాదనలు వినిపించగా, మే నెలలో శిక్షను మూడేళ్ల జైలు, 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాకు తగ్గించారు. అయితే ఈ తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

కోర్టు వివరాల ప్రకారం, కార్మిక మంత్రిత్వ శాఖ భవనాల్లో పారిశుద్ధ్య సేవలు అందించే కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు బహ్రెయిన్ పారిశుద్ధ్య కార్మికుల పేర్లతో వారి అనుమతి లేకుండానే రాజీనామా లేఖలు సిద్ధం చేసి, ఎలక్ట్రానిక్ సంతకాలు ఉపయోగించి ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో సమర్పించాడు. దీంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. అనంతరం వారిలో ఒక్కరికీ కూడా తిరిగి ఉద్యోగం లభించలేదు.

బాధితులు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం, ఇంగ్లిష్‌లో ఉన్న పత్రంపై సంతకం చేయాలని మేనేజర్ కోరగా, అది రాజీనామా పత్రం అని చెప్పలేదు. మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ధృవీకరణ కోడ్‌ను ఇవ్వాలని అడగడంతో వారు ఇచ్చారు. ఆ కోడ్‌ను ఉపయోగించి వారి ఎలక్ట్రానిక్ సంతకాలను రాజీనామా పత్రాలపై నమోదు చేసినట్లు తర్వాత తెలిసిందని వారు తెలిపారు.

ఒక బాధితుడు మాత్రం ఆ కోడ్ ఉద్యోగుల హాజరు (టైమ్‌షీట్) నమోదుకు సంబంధించినదేనని మేనేజర్ చెప్పాడని వెల్లడించాడు. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగితో కలిసి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయడం, నకిలీ పత్రాలను అసలైనవిగా వినియోగించడం వంటి అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com