పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి

- August 07, 2026 , by Maagulf
పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి

న్యూ ఢిల్లీ: దేశంలోని అత్యంత వెనుకబడిన గిరిజన తెగల (PVTGs) సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-జన్ మన్ (PM-JANMAN) పథకం కింద దేశవ్యాప్తంగా 2,498 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించగా, వాటిలో 2,487 కేంద్రాలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడించారు.

మచిలీపట్నం లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ వివరాలు వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని 75 అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు (PVTGs) నివసిస్తున్న 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం-జన్ మన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ఈ మిషన్‌లో భాగంగా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించింది.

2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం 2,498 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించింది. వీటిలో 2,487 కేంద్రాలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, 714 కేంద్రాల భవన నిర్మాణం పూర్తయింది. ప్రతి అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కు 192 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయగా, వాటిలో 189 కేంద్రాలు ఇప్పటికే సేవలు ప్రారంభించాయి.

ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, పీఎం-జన్ మన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు నాణ్యమైన పోషకాహారం, చిన్నారుల ప్రాథమిక సంరక్షణ, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన ఆరోగ్య, సంక్షేమ సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు తల్లి-శిశు సంక్షేమానికి మరింత బలమైన మద్దతు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com