గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం

- August 07, 2026 , by Maagulf
గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం

మచిలీపట్నం: గుడివాడ నుంచి కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ వరకు ప్రత్యేక రైలును నడిపే ప్రతిపాదనకు కీలక ముందడుగు పడింది. మచిలీపట్నం లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేసిన విజ్ఞప్తిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనను పరిశీలించి, ఆపరేషనల్ పరంగా ప్రత్యేక రైలును నడపడం సాధ్యమేనని తమ నివేదికలో పేర్కొన్నారు.

అధికారుల నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేక రైలు నిర్వహణకు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే వాణిజ్యపరమైన సాధ్యత, ప్రయాణికుల డిమాండ్, ఆక్యుపెన్సీ, ఆదాయ అవకాశాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రత్యేక రైలు ద్వారా సుమారు 1,000 మంది భక్తులు శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం విజయవాడ డివిజన్ పరిధి నుంచి శివమొగ్గ ప్రాంతానికి నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ఈ ప్రత్యేక రైలు భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అదే సమయంలో రైల్వేకు అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని వాణిజ్య విభాగం అభిప్రాయపడింది.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలు అవసరమని పేర్కొంటూ, ప్రతిపాదనను తదుపరి ఆమోదం కోసం రైల్వే ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులు సిఫారసు చేశారు. అనంతరం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ తదుపరి ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, శృంగేరి శారదా పీఠం దర్శనానికి వెళ్లే వేలాది మంది భక్తులకు గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రైలును త్వరలోనే ప్రారంభించేందుకు రైల్వే బోర్డు స్థాయిలో అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

అలాగే ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి ముందుకు తీసుకెళ్లిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, విజయవాడ డివిజన్ అధికారులకు ఎంపీ వల్లభనేని బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com