కువైట్‌లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్‌పై కఠిన నిబంధనలు..!!
- August 11, 2026
కువైట్ : కువైట్ ప్రభుత్వం కొత్త కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రవాసులు వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని షరతులకు లోబడి ఆర్టికల్ 18 రెసిడెంట్లు కంపెనీలో 49 శాతం వరకు వాటా కలిగి ఉండేందుకు అవకాశం కల్పించారు. ఆర్టికల్ 18 రెసిడెంట్ ఇప్పటికే ఉన్న కంపెనీ యాజమాన్య నిర్మాణంలో చేరి, కంపెనీ మూలధనంలో గరిష్ఠంగా 49 శాతం వరకు వాటాను కలిగి ఉండవచ్చు.
అయితే ఈ నిబంధన వ్యక్తిగత సంస్థలకు వర్తించదు. అలాంటి సంస్థల యాజమాన్యం కువైట్ పౌరులకే పరిమితం అవుతుంది. అవసరమైన లైసెన్స్ లేకుండా ప్రవాసులు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఉన్న లైసెన్స్ పరిధికి బయట వ్యాపారం చేయడం, ప్రభుత్వం నిషేధించిన లేదా నిలిపివేసిన కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అవసరమైన అనుమతులు లేకుండా కరెన్సీలు, సెక్యూరిటీల ట్రేడింగ్ లేదా గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించడం కూడా ఉల్లంఘనల పరిధిలోకి వస్తుంది.
వ్యాపార లైసెన్స్, కమర్షియల్ రిజిస్టర్ లేదా ట్రేడ్‌మార్క్‌ను వాస్తవంగా వ్యాపారం నిర్వహించే మరో వ్యక్తికి ఉపయోగించుకునేలా ఇవ్వడం కూడా కమర్షియల్ కన్సీల్మెంట్‌గా పరిగణించవచ్చు. ఇందులో కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇద్దరు కువైట్ పౌరుల మధ్య జరిగే ఏర్పాట్లు కూడా ఉండొచ్చు.కమర్షియల్ కన్సీల్మెంట్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ప్రవాసులకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే KD10,000 నుంచి KD100,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పొందిన లాభాల ఆధారంగా జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
ప్రవాసులకు ముఖ్యమైన అంశం ఏమిటంటే.. కమర్షియల్ కన్సీల్మెంట్ కేసును పరిష్కరించుకున్నంత మాత్రాన అడ్మినిస్ట్రేటివ్ డిపోర్టేషన్ నుంచి ఆటోమేటిక్‌గా మినహాయింపు లభించదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని అధికారులు భావిస్తే విదేశీ నిందితుడిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం జరిమానాలు, శిక్షల అమలుకు ముందు ఆరు నెలల గడువు ఇవ్వనున్నారు. ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ జారీ అయిన తర్వాత అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారాలు, వ్యక్తులు తమ కార్యకలాపాలను చట్టబద్ధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
కొత్త చట్టం ఆర్థిక పర్యవేక్షణను కూడా బలోపేతం చేస్తోంది. లబ్ధిదారుల యాజమాన్యం (Beneficial Ownership) లేదా ఆర్థిక లావాదేవీల్లో అనుమానాస్పద వ్యత్యాసాలు కనిపిస్తే బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంబంధిత సంస్థలు వాటిని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







