700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- August 11, 2026
బహ్రెయిన్: 700 కిలోల విద్యుత్ వైర్ల చోరీ కేసులో ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష పూర్తైన అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. 36, 36, 24 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులు రాస్ జువైద్లోని ఓ సంస్థ గోదాములో చోరీకి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. చోరీకి ముందు అక్కడి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి, అతడిని కుర్చీకి కట్టేసినట్లు విచారణలో తేలింది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. 37 ఏళ్ల సెక్యూరిటీ గార్డు రాత్రి విధుల్లో ఉండగా ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు సెక్యూరిటీ గదిలోకి ప్రవేశించి అతడిపై దాడి చేశారు. అనంతరం మరో నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. గార్డును కుర్చీకి కట్టేసి, ప్రధాన గేటు తాళం చెవిని తీసుకున్నారు. తర్వాత గోదాం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీగా విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. అనంతరం సెక్యూరిటీ గదిలో గార్డును బంధించి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి సుమారు 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గార్డు గదిలోనే చిక్కుకుపోయాడు. ఉదయం సంస్థ ఉద్యోగి వచ్చి అతడిని గుర్తించి బయటకు తీసుకువచ్చాడు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కొందరు ఆసియా వ్యక్తులు పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లను స్క్రాప్ షాపులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. ముగ్గురు నిందితులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వైర్ల బరువు సుమారు 700 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క కిలో వైర్‌ను BD1.800 చొప్పున విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బస్సుకు నకిలీ నంబర్ ప్లేట్
చోరీకి ఉపయోగించిన బస్సును కూడా పోలీసులు పరిశీలించారు. నిందితులు గుర్తుపట్టకుండా ఉండేందుకు బస్సుకు వేరే నంబర్ ప్లేట్ అమర్చినట్లు గుర్తించారు. కేసులో ముగ్గురు నిందితులపై నేరం రుజువు కావడంతో హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







