రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్‌షాపులు..!!
- August 11, 2026
దోహా: చిన్నారులు పాఠశాలలోకి అడుగుపెట్టే ముందు వారిని మానసికంగా, సామాజికంగా సిద్ధం చేసేందుకు ఖతార్ నేషనల్ లైబ్రరీ (QNL) ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘రెడీ ఫర్ స్కూల్’ పేరుతో ఆగస్టులో నిర్వహించే ఈ వర్క్‌షాపుల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులతో పాటు చిన్నారులకు అవసరమైన సూచనలు, శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లలు ఇంటి వాతావరణం నుంచి పాఠశాల వాతావరణంలోకి సులభంగా మారేందుకు అవసరమైన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా పిల్లల సామాజిక, భావోద్వేగ వికాసం, తల్లిదండ్రుల పాత్ర, స్వతంత్రంగా నేర్చుకునే నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.
ఆగస్టు 24న ఆన్లైన్ వర్క్‌షాప్
ఆగస్టు 24న ‘Social and Emotional Preparedness’ పేరుతో ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనవచ్చు. సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, సైకాలజికల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ థెరపీ నిపుణురాలు డాక్టర్ హెబా గమాల్ హరిరి ఈ కార్యక్రమంలో సూచనలు అందించనున్నారు. పిల్లల్లో మానసిక, సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం, వారిలో స్వతంత్రతను పెంచడం, ఇంటి నుంచి స్కూల్‌కు మారే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం వంటి అంశాలను వివరించనున్నారు.
ఆగస్టు 25న ‘తొలి టీచర్’గా తల్లిదండ్రులు
ఆగస్టు 25న ‘You Are the First Teacher’ పేరుతో మరో వర్క్‌షాప్ నిర్వహిస్తారు. పిల్లల తొలి విద్యా అనుభవంలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల పాత్రపై ఇందులో అవగాహన కల్పించనున్నారు. ఇంట్లో పిల్లలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, సరైన దినచర్యను అలవాటు చేయడం, పిల్లల్లో భావోద్వేగ, భాషా, ఆలోచనా సామర్థ్యాలను పెంచేందుకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం వంటి అంశాలపై సూచనలు ఇస్తారు. పాఠశాలపై పిల్లల్లో ఉండే భయాన్ని, ఆందోళనను తగ్గించడం, స్వతంత్రంగా పనులు చేసుకునేలా ప్రోత్సహించడం, తల్లిదండ్రులు-పాఠశాల మధ్య మెరుగైన సంబంధాలను ఏర్పరచడం వంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి.
చిన్నారుల కోసం రెండు రోజుల వర్క్‌షాప్
ఆగస్టు 26, 27 తేదీల్లో ‘Small Skills, Big Beginnings’ పేరుతో ప్రత్యేక ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులు ఒక తల్లిదండ్రితో కలిసి ఇందులో పాల్గొనవచ్చు. ఎర్లీ చైల్డ్‌హుడ్ నిపుణురాలు, సర్టిఫైడ్ ట్రైనర్ హియామ్ హెషామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో స్వతంత్రంగా పనులు చేసుకునే సామర్థ్యం, ఏకాగ్రత, సూచనలు పాటించే అలవాటు, ప్రారంభ విద్యకు అవసరమైన సూక్ష్మ కదలికల నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నారు.
బాల్య దశ పిల్లల మానసిక, జ్ఞాన, సామాజిక వికాసానికి ఎంతో కీలకమని QNL పేర్కొంది. తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులకు అవసరమైన ప్రాక్టికల్ సూచనలు అందించడంతో పాటు చిన్నారులను వయసుకు తగిన కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా పాఠశాలలోకి వారి మార్పును సులభతరం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్‌షాపులు..!!
- 700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్‌లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- 100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం ఆమోదం!
- 2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదం







