కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!

- August 11, 2026 , by Maagulf
కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!

కువైట్: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు, ఇతర వైద్య జోక్యాలకు సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రోగుల భద్రత, వైద్య ప్రమాణాలు, వైద్యుల బాధ్యతలను మరింత స్పష్టంగా చేయడమే లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధీ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. వైద్యులు తమ స్పెషలైజేషన్‌, ప్రొఫెషనల్ లైసెన్స్‌, అనుమతించిన క్లినికల్ ప్రివిలేజెస్‌కు అనుగుణంగానే శస్త్రచికిత్సలు, వైద్య ప్రక్రియలు నిర్వహించాలి.

ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు తమ వర్గీకరణకు అనుగుణంగా తగిన లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఆరోగ్య సేవల నాణ్యత, ఇన్ఫెక్షన్‌ నియంత్రణ, అనస్థీషియా భద్రతకు సంబంధించిన అధికారిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ముందుగా నిర్ణయించిన సాధారణ శస్త్రచికిత్సలను (Elective Surgeries) స్పెషలిస్ట్‌ స్థాయి లేదా అంతకంటే ఉన్నత స్థాయి వైద్యుడు మాత్రమే నిర్వహించాలి.

ప్రతి వైద్య విభాగానికి సంబంధించిన కౌన్సిళ్లు తమ స్పెషలైజేషన్‌ పరిధిలోని శస్త్రచికిత్సలను వర్గీకరించాలి. ఆయా ఆపరేషన్లు నిర్వహించేందుకు వైద్యులకు అవసరమైన ప్రొఫెషనల్ ప్రివిలేజెస్‌ను కూడా నిర్ణయించాలి. వైద్యుడి హోదా, స్పెషలైజేషన్‌, అనుభవం, చేయాల్సిన శస్త్రచికిత్స స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అర్హతలను నిర్ణయిస్తారు. నిర్ణయం ప్రచురితమైన మూడు నెలల్లోగా ప్రతి కౌన్సిల్‌ తన ప్రతిపాదనలను ఆరోగ్య శాఖ అండర్‌ సెక్రటరీకి సమర్పించాలి.

కొత్త నిబంధనల్లో రోగుల హక్కులు, Informed Consentకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఏదైనా శస్త్రచికిత్స లేదా వైద్య ప్రక్రియ చేపట్టే ముందు చికిత్స అందిస్తున్న వైద్యుడు లేదా అధీకృత వైద్య బృందంలోని సభ్యుడు రోగి నుంచి సమ్మతి తీసుకోవాలి. రోగి సమ్మతి ఇవ్వలేని పరిస్థితుల్లో అతని చట్టబద్ధ ప్రతినిధి నుంచి అనుమతి పొందాలి. తీసుకున్న సమ్మతిని రోగి వైద్య రికార్డులో తప్పనిసరిగా నమోదు చేయాలి.

అలాగే ఆపరేషన్‌ నిర్వహించే వైద్య బృందంలోని సభ్యుల వివరాలను రోగికి తెలియజేయాలి. రోగి లేదా అతని చట్టబద్ధ ప్రతినిధి అనుమతి లేకుండా మరో వైద్యుడు శస్త్రచికిత్స చేయకూడదు. అయితే ప్రత్యామ్నాయ వైద్యుడికి అవసరమైన వృత్తిపరమైన అర్హత, అధికారం ఉంటే నిబంధనల ప్రకారం అవకాశం ఉంటుంది.

వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లో నిర్దిష్ట శస్త్రచికిత్సలు లేదా వైద్య జోక్యాలు నిర్వహించే వైద్యుడి అధికారాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అధికారం ఆరోగ్య శాఖ అండర్‌ సెక్రటరీకి లేదా ఆయన అధీకృత ప్రతినిధికి ఉంటుంది. వివిధ వైద్య విభాగాల మధ్య శస్త్రచికిత్స నిర్వహణకు సంబంధించిన ప్రివిలేజెస్‌ ఒకదానితో ఒకటి కలిసిపోయే సందర్భాల్లో సమస్యను పరిష్కరించేందుకు కూడా కొత్త నిబంధనల్లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు.అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చు. అయితే ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకోవడంతో పాటు, సంబంధిత ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, నైపుణ్యం కలిగిన వైద్య బృందం అందుబాటులో ఉండాలి.

 అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు లేదా తీవ్రమైన ఆరోగ్య నష్టాన్ని నివారించేందుకు తక్షణ శస్త్రచికిత్స అవసరమైతే.. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సర్జన్లను ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించేందుకు కూడా నియమించవచ్చు. అయితే ఇందుకు నిర్ణయంలో పేర్కొన్న అనుమతులు, విధివిధానాలను పాటించాల్సి ఉంటుంది.

రోగుల భద్రతను పెంచడం, వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం, శస్త్రచికిత్సలకు సంబంధించిన బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశంగా ఆరోగ్య శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com