ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- August 14, 2026
దోహా: వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు ముప్పు కలిగించే వాణిజ్య ఉల్లంఘనలపై ఖతార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి హైరిస్క్ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించి.. కొన్ని గంటల్లోనే పూర్తి చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వినియోగదారుల రక్షణ, వాణిజ్య మోసాల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ అలీ అల్-ఉజ్బా ఈ విషయాన్ని వెల్లడించారు. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత తమకు ‘రెడ్‌లైన్’ అని స్పష్టం చేశారు.వాణిజ్య ఉల్లంఘనలను హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజిస్తున్నట్లు అల్-ఉజ్బా తెలిపారు. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు నేరుగా ముప్పు కలిగించే హైరిస్క్ కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మీడియం రిస్క్ కేసుల్లో మరింత పరిశీలన, పరీక్షలు అవసరం కావచ్చని.. తక్కువ స్థాయి ఉల్లంఘనలను సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
వారంటీ, సర్వీసులపై ప్రత్యేక నిఘా
వినియోగదారులకు అమ్మకాల తర్వాత అందించాల్సిన సేవల విషయంలోనూ ఖతార్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వారంటీని అమలు చేయకపోవడం, స్పేర్ పార్ట్స్ అందించడంలో జాప్యం, మెయింటెనెన్స్ ఆలస్యం వంటి వాటిని ప్రధాన ఉల్లంఘనలుగా గుర్తిస్తున్నారు. మన్నికైన వస్తువులకు కనీసం మూడేళ్లపాటు స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ వంటి అమ్మకాల అనంతర సేవలు అందించడం సరఫరాదారుల బాధ్యతగా నిబంధనలు పేర్కొంటున్నాయి. మార్కెట్ పర్యవేక్షణను ఖతార్ ప్రభుత్వం మరింత పెంచింది. 2026 తొలి త్రైమాసికంలో ఏకంగా 74,766 తనిఖీలు నిర్వహించింది. 2025లో ఇదే కాలంతో పోలిస్తే తనిఖీలు 89 శాతం పెరిగాయి. ఈ సమయంలో వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 6,895 ఫిర్యాదులు అందగా.. వాటిలో 5,640 వినియోగదారుల రక్షణకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను సగటున ఎనిమిది రోజుల్లో, సరఫరాకు సంబంధించిన ఫిర్యాదులను ఒక రోజులో పరిష్కరించినట్లు వెల్లడించారు.
ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల సమయంలోనూ ఖతార్ వినియోగదారుల రక్షణ వ్యవస్థ వేగంగా పనిచేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 22 వరకు 49,756 అత్యవసర తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 80 వాణిజ్య సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించగా.. రెండు సంస్థలను మూసివేశారు. అత్యవసర కాలంలో అందిన 408 ఫిర్యాదులను 24 గంటల్లోపే పరిష్కరించినట్లు ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే సంస్థలపై దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని.. ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







