పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- August 24, 2026
దోహా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల స్కూల్ బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక, వినియోగంపై ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) కీలక సూచనలు జారీ చేసింది. పిల్లల శరీరాకృతికి, వయసుకు తగిన బ్యాగ్‌ను ఎంచుకోవడంతో పాటు, దానిని సరిగ్గా ధరించడం ద్వారా వెన్ను, భుజాలపై అనవసర ఒత్తిడిని నివారించవచ్చని తెలిపింది. తగిన బ్యాక్‌ప్యాక్‌ను ఎంపిక చేయకపోవడం లేదా తప్పుగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో వెన్నునొప్పి, స్పైనల్ కర్వేచర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రతిరోజూ పుస్తకాలు, స్టేషనరీ, ఇతర సామగ్రిని మోసుకెళ్లాల్సి ఉండటంతో సరైన బ్యాగ్‌ను ఎంచుకోవడం ముఖ్యమని పేర్కొంది.
MoPH ఆన్లైన్లో ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ మన్నికైన, నాణ్యమైన, నీటిని నిరోధించే, సులభంగా శుభ్రం చేసుకునే మెటీరియల్‌తో తయారై ఉండాలి. ముఖ్యంగా బ్యాగ్ తేలికగా ఉండాలి. అది విద్యార్థి శరీర బరువులో 10 నుంచి 15 శాతానికి మించకూడదు. వెన్నెముకకు రక్షణ కల్పించేలా బ్యాగ్ వెనుక భాగంలో మందమైన ప్యాడింగ్ ఉండాలి. భుజాలపై ఒత్తిడి తగ్గించేందుకు వెడల్పుగా, మెత్తటి ప్యాడింగ్ ఉన్న స్ట్రాప్‌లు ఉండాలని సూచించింది. వీటికి అనుసంధానమైన వెయిస్ట్ బెల్ట్ ఉంటే బ్యాగ్ బరువును శరీరమంతటా సమానంగా పంచేందుకు సహాయపడుతుందని తెలిపింది.
అలాగే బ్యాగ్‌లో పుస్తకాలు, ఇతర సామగ్రిని సక్రమంగా సర్దుకునేందుకు పలు కంపార్ట్మెంట్లు ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. దీంతో బరువు సమతుల్యంగా ఉండటంతో పాటు అవసరమైన వస్తువులను సులభంగా తీసుకోవచ్చని తెలిపింది. బ్యాగ్ పరిమాణం కూడా కీలకమేనని, అది మెడకు కొద్దిగా దిగువ నుంచి నడుము భాగంలోని వెన్ను వంపు పైభాగం వరకు ఉండేలా చూసుకోవాలని సూచించింది. చక్రాలతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను ఎంచుకునే కుటుంబాలు పెద్ద చక్రాలు, పిల్లల ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే హ్యాండిల్ ఉన్న మోడళ్లను ఎంచుకోవాలని సూచించింది.
విద్యార్థులు బ్యాక్‌ప్యాక్‌ను ఎక్కువసేపు ధరించకుండా, ఆ రోజు అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలని తెలిపింది. పదునైన లేదా అసాధారణ ఆకారంలో ఉన్న వస్తువులను బ్యాగ్ వెనుక భాగానికి ఆనకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. పిల్లల వయసు, శరీర బరువుకు సరిపోయే బ్యాగ్‌ను ఎంపిక చేయడంలో తల్లిదండ్రులు సహాయం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రతిరోజు పాఠశాల టైమ్‌టేబుల్‌కు అనుగుణంగా బ్యాగ్‌లోని వస్తువులను తల్లిదండ్రులు పరిశీలించాలని తెలిపింది.
పిల్లల్లో భుజాలు అసమానంగా కనిపించడం, వెన్ను వంగిపోవడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కాపాడుకోవడంలో ఇబ్బంది లేదా తరచూ వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని MoPH సూచించింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







