దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!

- August 25, 2026 , by Maagulf
దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!

దుబాయ్: 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు దుబాయ్‌లో విద్యార్థుల పాఠశాల రవాణా వ్యవస్థను మరింత భద్రంగా, సులభంగా మార్చేందుకు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కీలక చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు సంప్రదాయ స్కూల్ బస్సులతో పాటు మరిన్ని రవాణా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, స్కూల్ బస్సులపై భద్రతా తనిఖీలను కఠినతరం చేయనున్నారు. ఇందులో భాగంగా స్కూల్ బస్సు ఆపరేటర్లకు RTA మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బస్సులు పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నాయా, అన్ని భద్రతా తనిఖీలు పూర్తయ్యాయా, డ్రైవర్లు మరియు బస్ అటెండెంట్ల అనుమతులు చెల్లుబాటు అవుతున్నాయా అనే అంశాలను నిర్ధారించాలని ఆదేశించింది.

దుబాయ్‌లోని పాఠశాలలు, స్కూల్ బస్సులపై 30 రోజులపాటు ప్రత్యేక తనిఖీల కార్యక్రమం నిర్వహించనున్నారు. భద్రతా ప్రమాణాలు, నిర్వహణ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తారు. తల్లిదండ్రులకు సంప్రదాయ స్కూల్ బస్సులకు ప్రత్యామ్నాయంగా పలు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీఏ మద్దతుతో కరీం స్కూల్ రైడ్స్, ఊబర్ టీన్స్, బోల్ట్ స్కూల్ వంటి సేవల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అల్ బర్షా ప్రాంతంలో యాంగో యాప్ ద్వారా స్కూల్ రైడ్-పూలింగ్ సేవ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రత్యేక ప్యాకేజీలతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.

నోల్ కార్డు ఉపయోగించే విద్యార్థులకు RTA ప్రజా రవాణా సేవలపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో మెట్రో, ట్రామ్, పబ్లిక్ బస్సులు ఉన్నాయి. అలాగే స్కూల్ ప్రారంభం, ముగింపు సమయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు స్కూల్ జోన్లలో ట్యాక్సీల సంఖ్యను పెంచనున్నారు.  అల్ నహ్దా, ముహైస్నా, అల్ బర్షా, అల్ ఖౌజ్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అల్ గర్హౌద్ తదితర ప్రాంతాల్లో పాఠశాలలకు సేవలందించే 30కి పైగా బస్సు మార్గాల్లో సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచనున్నారు. దీంతో విద్యార్థులకు బస్సులు, ట్యాక్సీలు సులభంగా లభించడంతో పాటు వేచి ఉండే సమయం తగ్గుతుందని RTA తెలిపింది.
విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

స్కూల్ బస్సులు, రైడ్-పూలింగ్ వాహనాలు, రైడ్-హైలింగ్ సేవల్లో సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. స్కూల్ బస్సుల తనిఖీలు, డ్రైవర్లు-అటెండెంట్ల అనుమతుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలతో పాటు అదనపు బస్సులు, ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు దుబాయ్ RTA వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com