షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- August 25, 2026
షార్జా: యూఏఈలోని షార్జాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి కిందపడటంతో ఏడేళ్ల భారతీయ బాలిక మృతి చెందింది. సోమవారం ఉదయం అల్ నబ్బా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు షార్జా పోలీసులు తెలిపారు. మృతురాలిని సఫాగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. గత తొమ్మిదేళ్లుగా వారు యూఏఈలో నివసిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఘటన సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా సుమారు ఐదు నిమిషాలపాటు ఉంది. ఆమె తల్లి షార్జాలోని తన ఉద్యోగానికి వెళ్లగా, తండ్రి కారు పార్కింగ్‌లోకి మార్చేందుకు కాసేపు బయటకు వెళ్లారు. బాలిక తన తండ్రి కోసం బయటకు చూడటానికి స్లైడింగ్ కిటికీ తెరిచి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె అదుపుతప్పి కిందపడినట్లు వారు తెలిపారు. సఫా అజ్మాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానమని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల ప్రకారం.. ఇటీవలే కుటుంబంలో ఓ వివాహ వేడుక జరిగింది. భారత్‌లో జరిగిన ఆ వేడుకకు కుటుంబమంతా హాజరై ఆనందంగా గడిపింది. బంధువులు, కజిన్స్‌తో కలిసి సఫా ఎంతో సంతోషంగా గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఆ కుటుంబం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది.
కాగా, ఈ ఘటనపై షార్జా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బాలిక మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావిస్తున్నారు.ఇక సఫాను యూఏఈలోనే ఖననం చేయాలని వారి కుటుంబం నిర్ణయించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







